Cyber Criminals: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకిన సైబర్ నేరగాళ్లు

  • ఝార్ఖండ్‌లో ఘటన
  • నదిలో దూకి నిందితులను వెంబడించి పట్టుకున్న పోలీసులు
  • రూ. 8.29 లక్షల నగదు, 12 మొబైళ్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్‌కార్డులు సహా మరెన్నో స్వాధీనం
  • పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన స్థానికులు
Cyber Criminals In Jharkhand Jumped Into River To Evade Arrest

పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆరుగురు సైబర్ నేరగాళ్లు నదిలో దూకారు. ఝార్ఖండ్‌లో జరిగిందీ ఘటన. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసు బృందం బరాకర్ నది ఒడ్డున సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు వెళ్లారు. సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ వారు పోలీసులేనని, తమకోసమే వస్తున్నారని గుర్తించిన నిందితులు.. అమాంతం నదిలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వారు కూడా నదిలోకి దూకి వారిని వెంబడించి మొత్తానికి అరదండాలు వేశారు. 

సైబర్ క్రిమినల్స్ ఆటకట్టించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం రూ.8,29,600 నగదు, 12 మొబైల్ ఫోన్లు, 21 ఏటీఎం కార్డులు, 18 సిమ్‌కార్డులు, 12 పాస్‌బుక్‌లు, ఆరు చెక్‌బుక్‌లు, నాలుగు పాన్‌కార్డులు, రెండు ఆధార్‌కార్డులను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్ట్ అయిన సైబర్ నేరగాళ్లు యాప్‌ల ద్వారా నగ్న వీడియో కాల్స్ చేసి, ఆపై బాధితులను బ్లాక్‌మెయిల్ చేసేందుకు స్క్రీన్‌షాట్లు తీసుకుని మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అలాగే, పోషకాహార ట్రాకర్ యాప్ ద్వారా ప్రసూతి ప్రయోజనాల గురించి తప్పుడు వాగ్దానాలతో గర్భిణులను కూడా వారు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు.   

ఆపరేషన్ సందర్భంగా పోలీసులు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న పిల్లల కిడ్నాప్ వంటి పుకార్లతో స్థానికులు పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పోలీసులు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు.

More Telugu News