Kashmir: ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటు మాత్రమే.. రద్దు సబబే: సుప్రీంకోర్టు తీర్పు

  • కీలక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు 
  • తీర్పు చదివి వినిపించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
  • కశ్మీర్ పై రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని వ్యాఖ్య
  • 2024 సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఆదేశాలు
Supreme Court Verdict On Article 370

జమ్మూకశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేయడంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. భారత దేశంలో కలిసినపుడు కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని వ్యాఖ్యానించింది. అప్పట్లో జమ్మూకశ్మీర్ లో ఉన్న పరిస్థితులు, యుద్ధ వాతావరణం కారణంగానే ఆర్టికల్ 370 ని ఏర్పాటు చేశారని పేర్కొంది. ఈ ఆర్టికల్ ఏర్పాటు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదని తేల్చిచెప్పింది. ఈమేరకు ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చదివి వినిపించారు.

ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లను విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని సీజేఐ తెలిపారు. ఈ ధర్మాసనంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తో పాటు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, దీనిపై రాష్ట్రపతి ప్రకటన చేశారని ధర్మాసనం గుర్తుచేసింది. పార్లమెంట్ నిర్ణయాన్ని, రాష్ట్రపతి ప్రకటనను కొట్టిపారేయలేమని తేల్చి చెప్పింది.

దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కశ్మీర్ కూడా సమానమేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మిగతా రాష్ట్రాలకు లేని ప్రత్యేక ప్రతిపత్తి కశ్మీర్ కు మాత్రమే ఉండదని, ఆర్టికల్ 370 నాటి పరిస్థితుల దృష్ట్యా చేసిన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. 2024 సెప్టెంబర్ 30 లోపు జమ్మూకశ్మీర్, లడఖ్ లలో ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.

 ఇదిలావుంచితే, ఆర్టికల్ 370పై తీర్పు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లో కేంద్రం అలర్ట్ ప్రకటించింది. భద్రతాబలగాలతో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. శాంతికి విఘాతం కలిగించే పనులను అడ్డుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా గౌరవించాలని బీజేపీ పిలుపునిచ్చింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

అయితే, కోర్టు తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని అబ్దుల్లాతో పాటు గుప్కార్ అలయెన్స్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 ని సుప్రీంకోర్టు పునరుద్ధరిస్తుందని భావించారు. జమ్మూకశ్మీర్ లోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్ గా ఏర్పడి ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆగస్టులో దాఖలైన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి తాజాగా తీర్పు వెలువరించింది.

More Telugu News