Kavitha: ఇవి తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా స్వాగతించాల్సిన ఘడియలు: కవిత

  • జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం
  • గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్టాపన
  • కోట్లాది మంది హిందువుల కల నెరవేరబోతోందన్న కవిత
Kavitha tweet on Ayodhya Ram Mandir

దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ ఘడియలు వచ్చేస్తున్నాయి. అయోధ్యలోని రామ మందిరాన్ని ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతోంది. జనవరి 22వ తేదీన ఆలయం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 

ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4 వేల మంది సాధువులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా ఎంతో మంది రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన వైదిక కార్యక్రమాలు ఒక వారం ముందు నుంచే అంటే జనవరి 16 నుంచే ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో అన్ని రకాల వసతి, భద్రతా చర్యలు చేపడుతున్నారు. 


మరోవైపు, అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'శుభ పరిణామం... అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్ట, కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభ సమయంలో... తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు... జై సీతారామ్' అని ట్వీట్ చేశారు. రామ మందిరం వీడియోను కూడా షేర్ చేశారు.

More Telugu News