Indian Navy: విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు... ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

  • సాగరతీరంలో యుద్ధ విన్యాసాలు
  • వీక్షకులను అలరించిన సైనికుల ప్రతిభా పరాక్రమాలు
  • నేవీ కమాండోలు, పారాట్రూపర్లు, యుద్ధ ట్యాంకులు, నౌకలతో సైనిక విన్యాసాలు
AP Governor Abdul Nazeer attends navy drills in Vizag

విశాఖలో తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో విన్యాసాలు నిర్వహించారు. భారత నేవీ వాయు విభాగం, సైన్యం కూడా ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ విన్యాసాల ద్వారా భారత నేవీ పరాక్రమం, ప్రతిభా పాటవాలను ఘనంగా ప్రదర్శించారు. భారత నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ విన్యాసాలు చేపట్టారు. ఇందులో నేవీ కమాండోలు పాల్గొని తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లితే ఎలా కాపాడేదీ ప్రదర్శించారు. ఇందులో తేలికపాటి పోరాట హెలికాప్టర్లు, నేవీకి చెందిన బోట్లు, బీఎంపీ యుద్ధ ట్యాంకులు, మీడియం ల్యాండింగ్ షిప్పులు పాల్గొన్నాయి. 

సముద్రంలో నిర్దేశించిన మేరకు లక్ష్యాలను పేల్చివేయడం కూడా ఈ విన్యాసాల్లో ప్రదర్శించారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ పారాట్రూపర్ల విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ కు వెళ్లే అన్ని రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

More Telugu News