Telangana Congress: మిగిలినవి ఆరు మంత్రి పదవులు.. గెలిచినోళ్లు, ఓడినోళ్లు కూడా పోటాపోటీ ప్రయత్నాలు!

  • మరో వారం పది రోజుల్లో తెలంగాణ కేబినెట్ పూర్తిస్థాయి విస్తరణ
  • ఆరు మంత్రి పదవుల కోసం 11 మంది పోటీ
  • అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో నేతలు
Telangana Congress leaders who won and lost wanted ministerial posts

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ నిన్న అసెంబ్లీలో కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి మరో 11 మందికి మంత్రి పదవులు కేటాయించారు. మరో ఆరుగురికి కేబినెట్‌లో చోటు ఉండగా మొత్తం 15 మంది పోటీపడుతున్నారు. వీరిలో ఓడినవాళ్లతోపాటు అస్సలు పోటీ చేయని వాళ్లు కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా షబ్బీర్ అలీ, వివేక్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, సుదర్శన్‌రెడ్డి, మధుయాష్కి, అద్దంకి దయాకర్, బాలునాయక్ వంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, అధిష్ఠానం మాత్రం జిల్లాలు, ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణను బేరీజు వేసుకుని పదవులు కేటాయించాలని యోచిస్తోంది. 

జిల్లాల వారీగా చూస్తూ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, మెదక్‌ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం దక్కింది. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఎవరికీ బెర్త్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. దీంతో ఆయా జిల్లాల నేతలు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. 

ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్, చెన్నూరులో వివేక్, బెల్లంపల్లిలో వినోద్‌కుమార్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వినోద్ అయితే ఏకంగా ఢిల్లీ పెద్దలనే కలిసి మంత్రి పదవి కోసం మొరపెట్టుకున్నట్టు సమాచారం. ఇక, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ ప్రయత్నిస్తుండగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ గెలవనప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. అయితే, ఇదే కోటాలో షబ్బీర్ అలీ కూడా ఉండడంతో వీరిద్దరిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

అలాగే, మైనంపల్లి హన్మంతరావు, మధుయాష్కీ, అంజన్‌కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ ఉండడంతో వీరంతా ఇప్పుడు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

More Telugu News