Proddutur: ప్రొద్దుటూరు 1వ టౌన్ మహిళా ఎస్‌ఐపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Proddutur SI Hymavati attacked by unidentified persons on friday night
  • బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి ఎస్ఐ హైమావతిపై ఇద్దరు వ్యక్తులు దాడి
  • దాడి ఘటనలో ఎస్ఐ కాలికి గాయం.. పగిలిపోయిన ఫోన్
  • నిందితులను త్వరగా పట్టుకోవాలంటూ ఎస్పీ ఆదేశాలు
  • ఇసుక అక్రమ రవాణాదారులే దాడి చేసి ఉండొచ్చని సందేహాలు
వైఎస్ఆర్(కడప) జిల్లా ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న వేళ 1వ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా ఎస్‌ఐ హైమావతిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి రాయితో ఆమెపై దాడి చేశారు. రామేశ్వరం బైపాస్‌ రోడ్డులోని రెండు కుళాయిల సమీపంలో ఈ దాడి జరిగింది. ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందడంతో ఎస్‌ఐ హైమావతి కానిస్టేబుల్‌తో కలిసి బైపాస్‌ రోడ్డు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశారు. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఆపకుండా వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత వెనక్కి వచ్చి.. ‘మమ్మల్ని ఆపుతారా..’ అంటూ ఎస్‌ఐపై రాయి విసిరి పారిపోయారు.

ఈ ఘటనలో ఎస్ఐ కాలికి గాయమైంది. ఆమె సెల్‌ఫోన్‌ పగిలిపోయింది. ఈ దాడి ఘటన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ కు తెలియడంతో ఆయన స్పందించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని ప్రొద్దుటూరు పోలీసులను ఆదేశించారు. ఈ దాడి ఘటనపై ఎస్‌ఐ హైమావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఐపై దాడి చేసిన వ్యక్తులు ఇసుక అక్రమ రవాణాదారులే కావొచ్చునని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Proddutur
YSR district
Andhra Pradesh
SI attacked

More Telugu News