Revanth Reddy: అన్ని వర్గాలకు నిరంతర కరెంటు అందించాల్సిందే.. విద్యుత్‌శాఖ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

  • తెలంగాణ విద్యుత్ సంస్థల మొత్తం అప్పు రూ. 81,516 కోట్లు
  • డిస్కంలు తీసుకున్న రూ. 30,406 కోట్ల రుణంపై నెలకు రూ.1000 కోట్ల వడ్డీ
  • వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌పై లేని లెక్కలు
  • ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఎంతవుతుందో అంచనాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశం
Continuous electricity should be provided to all communities CM Revanth Reddy orders

తెలంగాణ విద్యుత్ సంస్థ అప్పు మొత్తం రూ. 81,516 కోట్లుగా తేలింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో అంటే 2014-15లో ఇది రూ. 22,423 కోట్లుగా ఉంది. విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న నిర్వహించిన అంతర్గత సమీక్షలో ఈ విషయం వెల్లడైంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ట్రాన్స్‌కో, జెన్‌కో సహా రాష్ట్రంలోని నాలుగు సంస్థల అప్పులు, నష్టాలను వివరించారు. 

 విద్యుత్ కొనుగోలు చేసినందుకు బిల్లల చెల్లింపుల కోసం డిస్కంలు స్వల్పకాలిక రుణం కింద రూ. 30,406 కోట్లు తీసుకున్నాయి. దీనికి నెలకు వడ్డీనే రూ. 1000 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు కరెంటు బిల్లుల వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిసి మొత్తం ఆదాయం రూ. 22,781 కోట్లు ఉంటుంది. అయితే, అదే సమయంలో ఖర్చులు మాత్రం రూ. 33,839 కోట్లు ఉంటాయని అంచనా. అంటే ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 11,058 కోట్లన్నమాట. రెండు డిస్కంల నష్టాలు రూ. 50,275 కోట్లకు చేరుకున్నాయి.

మరోవైపు, వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి లెక్కలు లేవు. రాష్ట్రంలో 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు కరెంటు కనెక్షలున్నాయి. దీనినిబట్టి రాష్ట్ర విద్యుత్ వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండొచ్చన్న అంచనాతో ప్రభుత్వం ఆ మొత్తం రాయితీ సొమ్మును అందిస్తోంది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.82 కోట్ల కరెంటు కనెక్షన్లు ఉండగా తలసరి వార్షిక వినియోగం 2,349 యూనిట్లుగా ఉంది.

విద్యుత్ అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలను ఆదేశించారు. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందించాలని, కాబ్టటి అందుకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలు తయారుచేసి అందించాలని ఆదేశించారు. అందరికీ 200 యూనిట్ల చొప్పున ఉచితంగా కరెంటిస్తే ఏడాదికి దాదాపు రూ. 4 వేల కోట్ల వరకు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.

More Telugu News