VH: రేపు సోనియమ్మ పుట్టినరోజు... 78 కేజీల కేక్ కట్ చేస్తున్నాం: వీహెచ్

  • డిసెంబరు 9న సోనియా గాంధీ జన్మదినం
  • ప్రతి జిల్లాలో ఆమె పుట్టినరోజు జరపాలన్న వీహెచ్
  • తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలపాలని పిలుపు
  • రేపు ఉదయం 11.30 గంటలకు గాంధీభవన్ లో కేక్ కోస్తామని వెల్లడి 
VH says they will cut 78 kg cake on Sonia Gandhi birthday

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రేపు (డిసెంబరు 9) పుట్టినరోజు జరుపుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, సోనియా పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడారు. 

"సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై నమ్మకం ఉంచి తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు. పదేళ్ల కాలంగా తెలంగాణ ప్రజలు బాధలు పడుతున్నారు... వారి ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తుపాను ఆందోళన కలిగించింది. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమం జరిగే ఆ ఒక్క రోజున వర్షం పడకుండా చూడు తల్లీ అని పెద్దమ్మ తల్లిని కోరుకున్నారు. ఆయమ్మ కరుణించింది... సోనియా, రాహుల్, ప్రియాంక తదితరులు హాజరైన ఆ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. నిన్న వర్షం లేకపోవడంతో గ్రామాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలు సంతోషంతో వెనుదిరిగారు. అమ్మ నా కోరిక నెరవేర్చడంతో ఈ ఉదయం పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి పూజలు చేసి వచ్చాను. 

అదే విధంగా... రేపు సోనియా గాంధీ గారి జన్మదినం. ఆమె 77 ఏళ్లు నిండి 78వ పడిలో ప్రవేశిస్తున్నారు. అందుకు గుర్తుగా 78 కేజీల కేక్ కట్ చేస్తున్నాం. రేపు ఉదయం 11.30 గంటలకు గాంధీభవన్ లో ఈ వేడుక ఉంటుంది. సోనియా పార్టీ పరంగా ఎంతో త్యాగం చేసి తెలంగాణ ఇచ్చారు. ప్రతి జిల్లాలోనూ పుట్టినరోజు వేడుకలు జరపడం ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది" అని వీహెచ్ వివరించారు.

More Telugu News