Rajagopal Reddy: కేసీఆర్ ఇక రిటైర్ అయితే బెటర్: కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • గజ్వేల్ లో తాను ప్రచారం చేస్తే కేసీఆర్ ఓడిపోయేవాడని వ్యాఖ్య
  • కేబినెట్ విస్తరణలో తనకూ అవకాశం వస్తుందని రాజగోపాల్ రెడ్డి ధీమా
  • భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి అభినందించిన సీనియర్ నేత
Komatireddy Rajagopal Reddy Comments On KCR

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ లో పోటిచేసినా, ప్రచారం చేసినా కేసీఆర్ ఓడిపోయేవారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ డిప్యూటీ సీఎంగా హైకమాండ్ ఎంపిక చేయడంపై రాజగోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం భట్టి నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి నివాసం ముందు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించాలని తాను ఆశించినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు దక్కకపోయినా సెకండ్ ఫేజ్ (మంత్రివర్గ విస్తరణ) లో తనకు తప్పకుండా చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి పదవి చేపడితే ప్రజలకు మరింత సేవ చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రాన్ని దేశం మొత్తానికీ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.

More Telugu News