Furniture Shifting: మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్యాంపు కార్యాలయం నుంచి ఫర్నిచర్ షిఫ్టింగ్.. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు

Former MLA Srinivas Goud Shifting Furniture From Camp Office Congress Cadre Obstruct

  • రవీంద్రభారతి వద్దనున్న క్యాంపు కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలించే యత్నం
  • అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు
  • సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు
  • జిల్లాల్లోనూ పలుచోట్ల ఇలాంటి ఘటనలు
  • అవి ప్రభుత్వ ఆస్తి అన్న ఆర్ అండ్ బీ శాఖ

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చర్య వివాదాస్పదమైంది. హైదరాబాదు, రవీంద్రభారతి వద్ద తన క్యాంపు కార్యాలయం నుంచి ఫర్నిచర్‌ను తరలిస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత రేగింది. కార్యాలయంలోని సోఫాలు, ఇతర ఫర్నిచర్‌ను శ్రీనివాస్‌గౌడ్ అనుచరులు ట్రాలీ ఆటోలోకి ఎక్కిస్తుండడాన్ని గమనించిన కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వ సొత్తును మీరెలా తీసుకెళ్తారంటూ వాగ్వివాదానికి దిగారు. అయితే, ఈ ఫర్నిచర్ తమదేనని వారు వాదులాటకు దిగారు. 

అక్కడే ఉన్న మహిళా సిబ్బంది మాట్లాడుతూ.. కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లు తీసుకెళ్లవద్దని గౌడ్ అనుచరులను కోరామని తెలిపారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేతలు, కేడర్ కలిసి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదొక్కటే కాదు.. జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

బోధన్‌లో షకీల్ అమీర్ క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఫర్నిచర్‌ను తరలించేందుకు ఆయన అనుచరులు ప్రయత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది గొడవకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లోని ఫర్నిచర్‌ను పర్యవేక్షిస్తున్న రోడ్లు, భవనాలశాఖ దీనిపై స్పందించింది. ఓడిపోయిన కొందరు ఎమ్మెల్యేలు కార్యాలయాల్లోని ఫర్నిచర్‌ను తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక్కో నియోజకవర్గంలో క్యాంపు కార్యాలయాలను కోటి రూపాయల చొప్పున నిధులతో నిర్మించినట్టు తెలిపింది. వాటి విద్యుత్ బిల్లులు, పన్నులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నట్టు వివరించింది. ఓడిపోయిన వారిలో కొందరు మాత్రమే కార్యాలయ తాళాలు తమకు అప్పగించినట్టు తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసు తాళాలు అందజేస్తామని ఆర్ అండ్ బీ సూపరింటెండెంట్ ఇంజినీర్ జి. రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. కార్యాలయాలకు మరమ్మతులు చేసి సిద్ధం చేస్తే మంచి రోజు చూసుకుని దిగుతామని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News