Pragathi Bhavan: రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే... ప్రగతి భవన్ వద్ద ఆంక్షల ఎత్తివేత.. బ్యారికేడ్ల తొలగింపు

  • కేసీఆర్ హయాంలో అధికార దర్పానికి కేంద్రబిందువుగా ఉన్న ప్రగతి భవన్
  • జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించిన పోలీసులు
  • బ్యారికేడ్ల లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు అనుమతి
Removal of barricades in front of Pragathi Bhavan started

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ ఒక వెలుగు వెలిగింది. అంతులేని అధికార దర్పానికి కేంద్రబిందువుగా ప్రగతి భవన్ కొనసాగింది. ఎమ్మెల్యేలకు సైతం లోపలకు వెళ్లేందుకు కష్టంగా ఉండేది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మారుస్తామని చెప్పారు. ప్రగతి భవన్, సెక్రటేరియట్ తలుపులు సామాన్య ప్రజలకు కూడా ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు. 

రేవంత్ చెప్పిన విధంగానే దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వద్ద ఉన్న అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ ను తొలగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పైనుంచి వచ్చిన ఆదేశాలతో జేసీబీలతో బ్యారికేడ్లను తొలగించారు. అంతేకాదు ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఉన్న బ్యారికేడ్స్ లోపల నుంచి కూడా వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు అనుమతించారు. రెండు రోజుల్లో బ్యారికేడ్లను పూర్తిగా తొలగించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.

More Telugu News