Visakhapatnam District: రైల్వే జోన్ ఏర్పాటుకు ఏపీ గవర్నమెంట్ భూమి ఇవ్వలేదు: మంత్రి అశ్వినీ వైష్ణవ్

  • దక్షిణకోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి లోక్‌సభలో ఎంపీ కె.రామ్మోహన్ నాయుడు ప్రశ్నలు
  • జోన్‌కు సంబంధించి డీపీఆర్ పూర్తయిందన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • 2023-24 సంవత్సరానికి రూ.10 కోట్లు కేటాయించినట్టు వెల్లడి
AP govt did not allot land for railway zone office in vizag says minister ashwini vaishnav

వైజాగ్‌లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటుకు సంబంధించి టీడీపీ ఎంపీ కె. రామ్మోహన్‌నాయుడు బుధవారం అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. 

‘‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. రూ.106.89 కోట్ల అంచనా వ్యయంతో జోనల్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులను మంజూరు చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయించాం. భూసర్వే, జోన్ ప్రధాన కార్యాలయ సముదాయం, రెసిడెన్షియల్ కాలనీ, ఇతర నిర్మాణాలకు అవసరమైన లే అవుట్ ప్లాన్ తయారీ బాధ్యతలను తూర్పుకోస్తా రైల్వే జోన్‌కు అప్పగించాం. 

బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (బీఆర్టీఎస్) కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే భూమి తీసుకున్నందున దానికి బదులుగా ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేకు అప్పగించాల్సి ఉంది. ఇందుకు అనువైన భూమిని ప్రభుత్వం ఇంకా గుర్తించి, రైల్వే శాఖకు అప్పగించాల్సి ఉంది’’ అని అశ్వినీ వైష్టవ్ తెలిపారు. వైజాగ్ జంక్షన్-గోపాలపట్నం మధ్య 15.31 కిలోమీటర్ల మేర రూ.159.47 కోట్లతో 3,4 లైన్ల నిర్మాణం కోసం 2023 ఏప్రిల్‌లో అనుమతులు మంజూరు చేసినట్టు రైల్వే మంత్రి పేర్కొన్నారు.

More Telugu News