Yanamala: లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా జగన్ ప్యాలస్ వదలడం లేదు: యనమల
- తుపానుపై ముందస్తు చర్యలు చేపట్టడంలో జగన్ విఫలమయ్యారన్న యనమల
- చివరకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మండిపాటు
- రూ. 7 వేల కోట్ల పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారని ఆవేదన
రాష్ట్ర వ్యాప్తంగా మిగ్జామ్ తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు ఆందోళనలో ఉన్నా.. జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను వదలడం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. తుపానుపై వారం నుంచే హెచ్చరికలు ఉన్నా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేయడంలో జగన్ విఫలమయ్యారని మండిపడ్డారు. బాధిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన ఆహారం, పునరావసంతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సరఫరా చేయలేక చేతులెత్తేశారని అన్నారు. తుపానుపై తూతూమంత్రంగా సమీక్ష చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడపాల్సిన పరిస్థితి ఉందని యనమల తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.7 వేల కోట్ల విలువైన పంట ఉత్పత్తులను రైతులు కోల్పోయారని చెప్పారు. ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి, కుప్పలపైన ఆరబోసిన వరి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. పొగాకు, పత్తి, మిర్చి, శనగ, అరటి, బొప్పాయి, మినుము, అపరాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు.
ముంపు ప్రాంతాల్లో ఇంటికో భోజనం పొట్లం ఇచ్చి సరిపెట్టుకోమనడం జగన్ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవడంతో పాటు.. బాధితులకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచి ఇవ్వాలని అన్నారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.