Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఎప్పటి వరకు ఆడతాడు?.. సమాధానం ఇదిగో!

  • తానిక నడవలేనని నిర్ధారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడతానన్న మ్యాక్సీ
  • ఐపీఎల్ తన కెరియర్‌పై ఎంతో ప్రభావం చూపించిందన్న ఆసీస్ ఆల్‌రౌండర్
  • కోహ్లీ, డివిలియర్స్ వంటి వారితో డ్రెస్సింగ్ రూం పంచుకోవడం గొప్ప అనుభూతి అంటూ ఆనందం
  • ఐపీఎల్‌లో 2021 నుంచి ఆర్సీబీకి ప్రాతినిధ్యం
I will play IPL until I cant walk anymore says Glenn Maxwell

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎప్పటి వరకు ఆడతాడో క్లారిటీ ఇచ్చేశాడు. తానిక నడవలేనన్న నిర్ధారణకు వచ్చే వరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటానని చెప్పుకొచ్చాడు. బిగ్‌బాష్ లీగ్ సీజన్ కోసం మెల్‌బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న మ్యాక్స్‌వెల్ తన కెరియర్‌లో ఐపీఎల్ ప్రభావంపై మాట్లాడాడు. బీబీఎల్ 13లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు అతడు సారథ్యం వహిస్తున్నాడు.  


‘‘ఐపీఎల్ బహుశా నేను ఆడే చివరి టోర్నీ కావొచ్చు. నేనిక నడవలేనని భావించే వరకు ఐపీఎల్ ఆడుతూనే ఉంటాను. నా కెరియర్‌కు ఐపీఎల్‌ ఎంతగానో ఉపకరించింది. ఎంతోమంది గొప్ప వ్యక్తులను కలుసుకున్నాను. కోచ్‌లు, అంతర్జాతీయ ఆటగాళ్లతో ఆడడం నా కెరియర్‌కు ఎంతగానో ఉపకరించింది’’ అని వివరించాడు. 


మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో 2021 నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి వారితో డ్రెస్సింగ్ రూము అనుభవాలను పంచుకున్నాడు. ఇతర గేమ్స్ చూస్తూ వారితో మాట్లాడుతుండడం గొప్ప అనుభూతి. ఏ ఆటగాడికైనా ఇది గొప్ప ఎక్స్‌పీరియన్స్ అని పేర్కొన్నాడు. 

మ్యాక్స్‌వెల్ 2012లో ఢిల్లీ కేపిటల్స్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతడి ఆఫ్ స్పిన్ బౌలింగ్, దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పగల సామర్థ్యం వంటివి అతడిపై అంచనాలు పెంచేశాయి. ఢిల్లీ తర్వాత ముంబైకి ఆడినప్పటికీ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఐపీఎల్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన మ్యాక్సీ.. పంజాబ్ జట్టు నుంచి ఉద్వాసనకు కూడా గురయ్యాడు. అయితే, ఆర్సీబీకి వచ్చాక మాత్రం తన సామర్థ్యం ఏపాటిదో నిరూపిస్తూ వస్తున్నాడు.

2021 సీజన్‌లో బెంగళూరు అతడిని రూ.14.25 కోట్లకు సొంతం చేసుకుంది. అప్పటి నుంచి అతడు ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్‌లో గ్లెన్ 513 పరుగులు సాధించగా, 2023 సీజన్‌లో 14 గేముల్లో మూడు అర్ధ సెంచరీలతో 400 పరుగులు చేశాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో తన అద్వితీయ ఆటతో జట్టుకు ప్రపంచకప్ అందించిపెట్టాడు.

More Telugu News