Liquor: ఈ రెండింటిపై సుంకం పెంచితే మరణాలకు అడ్డుకట్ట: డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు

  • ప్రజల ప్రాణాలను తోడేస్తున్న మద్యం, తీపి పానీయాలు
  • ఈ రెండింటి వల్ల ఏటా 34 లక్షల మంది మృత్యువాత
  • వీటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా వాడకాన్ని నివారించవచ్చన్న డబ్ల్యూహెచ్‌వో
WHO Recommend To Hike Excise Tax On Liquor And Sweet Drinks

నిజం చెప్పాలంటే గతంతో పోలిస్తే మన ఆరోగ్యం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. మారుతున్న జీవనశైలి, ఆహారం వంటివి ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించాయి. మరీ ముఖ్యంగా మద్యం, తీపి పానీయాలు ఆరోగ్యానికి మరింత హానికరమని తెలిసినా వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. మద్యం వల్ల ఏటా 26 లక్షల మంది, అనారోగ్య ఆహార పదార్థాల వల్ల 8 లక్షల మంది ఏటా మరణిస్తున్నారు. ఫలితంగా చిన్న వయసులోనే రోగాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ రెండింటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా మద్యం, తీపి పానీయాలపై ఎక్సైజ్ పన్నును మరింత పెంచాలని సిఫార్సు చేసింది. ఆల్కహాల్, షుగర్ బేవరేజెస్‌పై ప్రపంచంలోని చాలా దేశాలు చాలా తక్కువ సుంకాన్ని విధిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఆరోగ్య మానవాళిని పెంచేందుకు ఆల్కహాల్, తీపి పదార్థాలపై ఎక్కువ సుంకం విధించడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని అభిప్రాయపడింది. ఇందుకోసం ఆల్కహాల్ ట్యాక్స్ పాలసీ మాన్యువల్‌ను విడుదల చేసింది. 

అధిక పన్నులు విధించడం ద్వారా లిక్కర్ వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ఫలితంగా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలతోపాటు నేరాలను కూడా అదుపులో పెట్టవచ్చని వివరించింది. మద్యానికి బానిసలైనవారు మార్కెట్లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న దానిని కొనుగోలు చేసేందుకే ఇష్టపడతారని ఒక పరిశోధనలో తేలినట్టు పేర్కొంది. కాబట్టి మద్యం, తీపి పానీయాలపై సుంకాన్ని పెంచడం ద్వారా వాటిని వారికి దూరంగా ఉంచొచ్చని, తద్వారా మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడింది.

More Telugu News