shanthi kumari: మిగ్జామ్ తుపాను ఎఫెక్ట్... కలెక్టర్లను అప్రమత్తం చేసిన తెలంగాణ సీఎస్ శాంతికుమారి

  • రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం  
  • ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరలింపు
  • చెరువులకు గండ్లు పడకుండా చూడాలని సూచన
CS Shanti Kumari tele conference with CS Shanti Kumari

మిగ్జామ్ తుపాను ప్రభావంతో రాగల రెండురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

మిగ్జామ్ తుపాను కారణంగా తెలంగాణ జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లను, అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చూడాలన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్లకు సూచించారు. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News