CM Candidate: తెలంగాణ సీఎం అభ్యర్థిపై ఖర్గే క్లారిటీ

  • సాయంత్రంలోపు తేల్చేస్తామన్న కాంగ్రెస్ చీఫ్
  • ఢిల్లీలో సీనియర్లతో ఉత్తమ్, భట్టి విక్రమార్క భేటీ
  • సీల్డ్ కవర్ తో రాష్ట్రానికి రానున్న కాంగ్రెస్ పెద్దలు
By Today Evening CM Candidate will be anounced says Congress Chief mallikarjuna kharge

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో సోమవారం రాత్రే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వెలువడ్డాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగినా.. పార్టీలో సీనియర్ నేతలు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా ఆ పోస్టు కోసం పోటీపడడంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది.

ఎల్లా హోటల్ లో సీఎల్పీ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు నివేదించారు. ఈ విషయంపై మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిపై సాయంత్రంలోగా స్పష్టతనిస్తామని ప్రకటించారు.

తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించి ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తామని చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. హైకమాండ్ పెద్దలను కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీని కూడా కలవనున్నట్లు సమాచారం. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్ తో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర పరిశీలకులు మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని తెలుస్తోంది.

More Telugu News