Team India: ఆఖరి ఓవర్లో అర్షదీప్ అద్భుత బౌలింగ్... చివరి టీ20లోనూ టీమిండియా విక్టరీ

  • ముగిసిన టీమిండియా-ఆసీస్ టీ20 సిరీస్
  • ఐదో టీ20లో 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం
  • సిరీస్ ను 4-1తో ముగిసిన టీమిండియా
Team India victorious in 5th and last T20

ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా విజయంతో ముగించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20లో టీమిండియా 6 పరుగుల తేడాతో నెగ్గింది. 161 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాల్సి ఉండగా, అర్షదీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ చేసి ఆసీస్ ను కట్టడి చేశాడు. అర్షదీప్ విసిరిన ఇన్నింగ్స్ 20వ ఓవర్లో కేవలం 3 పరుగులు వచ్చాయంటే అతడెంత కట్టుదిట్టంగా బంతులు విసిరాడో అర్థం చేసుకోవచ్చు. ఆ ఓవర్లో ఓ వికెట్ కూడా తీశాడు.

ఈ మ్యాచ్ లో విజయంతో సిరీస్ ను టీమిండియా 4-1తో ముగించింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో బెన్ మెక్ డెర్మట్ 54, ట్రావిస్ హెడ్ 28, కెప్టెన్ మాథ్యూ వేడ్ 22 పరుగులు చేశారు. 

టీమిండియా పేసర్ ముఖేశ్ కుమార్ 3 వికెట్లతో రాణించాడు. ఓ దశలో వరుస బంతుల్లో మాథ్యూ షార్ట్ (16), బెన్ డ్యార్షూయిస్ (0)లను అవుట్ చేసి ఆసీస్ ను దెబ్బకొట్టాడు. అంతకుముందు ఓపెనర్ జోష్ ఫిలిప్పే (4) వికెట్ కూడా ముఖేశ్ కుమార్ ఖాతాలోనే చేరింది. 

అర్షదీప్ సింగ్ 2, రవి బిష్ణోయ్ 2, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ సిరీస్ లో విశేషంగా రాణించిన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్ లోనూ రెండు కీలక వికెట్లు తీశాడు. తొలుత ప్రమాదకర ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసిన బిష్ణోయ్... మిడిలార్డర్ లో ఆరోన్ హార్డీని కూడా పెవిలియన్ కు పంపాడు.

More Telugu News