Nara Lokesh: టీడీపీ బలహీనత అదే... సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాం: నారా లోకేశ్

  • పిఠాపురం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం 
  • 216వ రోజు కొనసాగిన పాదయాత్ర
  • పొన్నాడ శీలం వారి పాకలు గ్రామంలో దళితులతో లోకేశ్ ముఖాముఖి
Nara Lokesh Yuvagalam Padayatra in Pithapuram constituency

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 216వ రోజు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగింది. యండపల్లి జంక్షన్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు అడుగడగునా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.  

పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ శీలం వారి పాకల క్యాంప్ సైట్ లో మంగళగిరి, కాకినాడ, రంపచోడవరం నియోజకర్గాలకు చెందిన 500కు పైగా కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకులు ఎం.వీ.వీ.సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. వీరికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మధ్యాహ్నం భోజన విరామానంతరం పొన్నాడ శీలం వారి పాకలు గ్రామంలో నిర్వహించిన దళిత గళం సభకు ఉభయగోదావరి జిల్లాల నుంచి భారీ ఎత్తున దళితులు హాజరయ్యారు. 

వైసీపీ అహంకార ప్రభుత్వం పోయి... దళితుల ఆత్మగౌరవం గెలవాలి!

వైసీపీ అహంకార ప్రభుత్వం పోయి... దళితుల ఆత్మగౌరవం గెలవాలన్నదే మా లక్ష్యం, మరో 3 నెలల్లో రాబోయే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది. దళిత సోదరుల సమస్యలను నేరుగా తెలుసుకొని, టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక ఎలాంటి పథకాలు అమలు చేస్తామో చెప్పడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం.

రాజధాని ప్రాంతంలో అత్యధికంగా దళితులు ఉన్నారు, వారి కోసం 5 శాతం భూమిని రిజర్వ్ చేశాం, అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవడం వల్లే రాజధానిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అది అంబేద్కర్ పై చంద్రబాబుకు ఉన్న గౌరవం. 

నేను సైకో జగన్ లా పరదాలు కట్టుకుని రావాల్సిన పని లేదు, తప్పుచేయలేదు కాబట్టే దమ్ముగా ప్రజల్లో తిరుగుతున్నా. దాదాపు 3 వేల కి.మీ. పాదయాత్ర చేశాను, సుదీర్ఘ పాదయాత్రలో ఒక్కరు కూడా నన్ను ప్రశ్నించలేదు, అదీ తెలుగుదేశం చిత్తశుద్ధి, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను.

దళిత గళం ముఖాముఖిలో ప్రశ్నలు – లోకేశ్ సమాధానాలు:

ప్రశ్న, రాజేశ్: టీడీపీ దళితులకు వ్యతిరేకం అని, చంద్రబాబుకు దళితులు అంటే ఇష్టం ఉండదని ప్రచారం చేస్తున్నారు. ఎస్సీలు మిమ్మల్ని ఓడించినా వారికి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఎందుకు మీకు దళితులంటే అంత అభిమానం.?

లోకేశ్: టీడీపీకి ఒక బలహీనత ఉంది. చేసిన పనిని చెప్పుకోలేం. నేను ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా దళిత కాలనీల నుండే చేపట్టా. దళితుల తరఫున పోరాడినందుకు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎమ్.ఎస్.రాజు, వంగలపూడి అనితపై అట్రాసిటీ కేసులు పెట్టారు. మాజీమంత్రి జవహర్ ను పోలీస్ స్టేషన్ లో కింద కూర్చోబెట్టి అవమానించారు. ఆనాడు నేను దళిత రైతుల కోసం పోరాడితే నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రమ్య కుటుంబానికి న్యాయం చేయండని అడిగితే స్టేషన్ కు తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లాలో ఓ దళితుడికి చెందిన చేపల చెరువును కబ్జా చేస్తే దాన్ని మళ్లీ తిరిగి ఇప్పించాం. మా బలహీనత సరిదిద్దుకోవడానికే ఈ దళిత గళం వినిపిస్తున్నాం... చేసినవి చెప్పుకుంటున్నాం. 

ప్రశ్న, రాజేశ్: విదేశీ విద్య అనే గొప్ప పథకాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టారు. దానికి ఎన్టీఆర్, చంద్రబాబు, లేదా మీ పేరో, మీ కొడుకు దేవాన్ష్ పేరో పెట్టకుండా అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టారు. అమరావతిలో 125 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం పెట్టొచ్చుకదా...కానీ అంబేద్కర్ విగ్రహమే ఎందుకు పెట్టాలనుకున్నారు.?

లోకేశ్: బలహీన వర్గాల పిల్లలు విదేశాల్లో చదవాలనే ఆలోచనతోనే విదేశీ విద్య పెట్టాం. ఒకరు వెళితే వారి ద్వారా మరికొందరు వెళతారని విదేశీ విద్య తీసుకొచ్చాం. విద్య అందరి హక్కు అని అంబేద్కర్ రాజ్యాంగంలోనే చెప్పారు. అందుకే విదేశ విద్యకు ఆయన పేరు పెట్టాం. కానీ సైకో వచ్చాక అంబేద్కర్ పేరు తొలగించి సైకో జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నారు! ఇది అంబేద్కర్ పట్ల చిన్నచూపు కాదా? 

డాక్టర్ పిల్లా చంద్రం, ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోషియేషన్ అధ్యక్షులు: దళితులను జగన్ రెడ్డి మోసం చేసినట్లు ఏ సీఎం కూడా మోసం చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ రద్దు చేసిన పథకాలు మళ్లీ ప్రవేశపెడతారా? సన్నబియ్యం ఇస్తామని జగన్ ఇవ్వలేదు. సన్నబియ్యం మీరు వచ్చాక అందిస్తారా?

లోకేశ్: ఈ ప్రభుత్వం దళితులకు ఆపేసిన 27 సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. విదేశీ విద్య, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు, సబ్ ప్లాన్ లాంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తాం. డిగ్రీ గురుకులాలను దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేయాలో చూసుకుని ఏర్పాటు చేస్తాం.  మన ప్రభుత్వం రాగానే.... జగన్ ఆపేసిన సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభిస్తాం. 5 ఏళ్లలో ఆర్థిక వనరులు సమకూర్చుకుని మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.

చీలి విజయ, దళిత మహిళాశక్తి చైర్ పర్సన్: మీరు మంత్రిగా ఉన్నప్పుడు దళిత కాలనీ నుండే అభివృద్ధి చేశామన్నారు. కానీ ఇప్పుడు మా దళిత కాలనీల్లో ఈ చెత్త సీఎం చెత్త పన్ను కట్టించుకుంటూ మా దళితుల దగ్గర చెత్త వేస్తున్నారు. చెత్త పన్ను కట్టించుకుంటూ చెత్త తీసేయడం లేదు. నవంబర్ 27న జగ్గంపేట మండలం ఏర్పేడులో ఆడుకుంటున్న పిల్లలు అనారోగ్యానికి గురై జీజీహెచ్ లో వైద్యం తీసుకుంటున్నారు. మా దళిత కాలనీల్లో మీ ప్రభుత్వం వచ్చాక శుభ్రంగా ఉంచుతారా?

లోకేశ్: ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన చెత్త పన్ను ఎత్తేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దళిత కాలనీలకు అందిస్తాం.

రామ్ జీ, మాలమహానాడు, కొత్తపల్లి:
పాదయాత్ర మొదలుపెట్టాక దళితుల ఇబ్బందులు తెలుసుకున్నారు. జగన్ అధికారంలోకి రావడానికి కారణం దళితులే. మేము ఓట్లేశాక మాకు కొత్త పథకాలు తీసుకురాకుండా ఉన్న పథకాలు తొలగించారు. రిజర్వేషన్లు అమలు చేయడంలేదు. అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎంఎస్ఎంఈ రాయితీలు ఇవ్వడం లేదు. జగన్ లా మీరు కూడా మమ్మల్ని వదిలేస్తారా?

లోకేశ్: 2014లో టీడీపీ రాగానే రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలు చేశాం. బీమా ఇస్తామని చెప్పకపోయినా అమలు చేశాం. పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశాం. సబ్ ప్లాన్ పక్కాగా అమలు చేశాం. ఓనర్ కం డ్రైవర్ గా ఉపాధి కల్పించాం. పనులు చేసుకునేందుకు జీవో కూడా ఇచ్చాం. ప్రభుత్వానికి వాహనాలు అవసరం ఉంటే కార్పొరేషన్ ద్వారా కొన్న వాహనాలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాం. ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తాం. ఆత్మగౌరవంతో పని చేయాలనే జేసీబీలు ఇచ్చి పనులు కల్పించాం. నేను పాదయాత్ర గంగాధర నెల్లూరులో చేస్తున్నప్పుడు..ఒక యువకుడు వచ్చి నాకు గతంలో 3 లారీలు ఉన్నాయి...ఇప్పుడు డ్రైవర్ గా మారాను అన్నాడు. పేదవాడు పేదవాడుగా ఉండాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన. సొంత కాళ్లపై నిలబడాలనేది టీడీపీ ప్రభుత్వ విధానం. 

తాటి సత్యనారాయణ, రాజోలు: దళితులు పూర్వం నుండి పడుతున్న అవస్థలు, వివక్షను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టం వచ్చింది. కానీ అదే చట్టంతో మాపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. దళిత నాయకులపైనా కేసులు పెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా మాపై వివక్ష ఇంకా కొనసాగుతోంది. ఉపముఖ్యమంత్రిని జగన్ తన పక్కన కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అట్రాసిటీ చట్టాన్ని పటిష్టం చేసి రక్షణ కల్పిస్తారా.?

లోకేశ్: చట్టాల్ని అమలు చేసే బాధ్యత టీడీపీదే. హోంమంత్రి వనిత దళితులను కాపాడే పరిస్థితి లేదు. ఆమే వెళ్లి... దళితుడిని చంపిన అనంతబాబుతో కూర్చుంటున్నారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కూర్చోనివ్వకుండా నిలబెట్టారు. టీడీపీ ఉన్నప్పుడు అట్రాసిటీ యాక్ట్ చట్టబద్ధంగా అమలు చేశాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 4 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది నికార్సుగా అట్రాసిటీ చట్టం అమలు చేస్తాం.

మహాసేన రాజేశ్: బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ద్వారా దళితుల పిల్లలు మంచి స్కూళ్లలో చేరితే మీ ప్రభుత్వమే ఫీజులు చెల్లించింది. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ కూడా అందించారు. కానీ జగన్ వచ్చాక స్కూళ్లకు రంగులు వేసుకున్నారు తప్ప ఏమీ చేయలేదు. గురుకులాల వ్యవస్థను ఎన్టీఆర్ తీసుకొచ్చారు.

లోకేశ్: ఎన్టీఆర్ ఎయిడెడ్ స్కూళ్లో చదివారు. కానీ ఈ ప్రభుత్వం వాటిని కూడా చంపేసింది. కుటుంబం పేదరికం నుండి బయటకు రావాలంటే చదివించడమే మార్గమని చంద్రబాబు నమ్మారు. దగ్గర్లో ప్రభుత్వ పాఠశాల లేకుంటే ప్రైవేటు స్కూల్లో చేర్చుకుంటే ఫీజులు చెల్లించాం. కానీ ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. టీడీపీ వచ్చాక బెస్ట్ అవెయిలబుల్, విదేశీ విద్య, పీజీ విద్యార్థులకు పీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం.

మెహేమియా: తెలంగాణలో ప్రియాంక రెడ్డి చనిపోతే రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చారు. కానీ రమ్యను చంపారు. పులివెందులలో నాగమ్మను చంపారు. దీనిపై చర్యలు తీసుకోలేదు. దళితులు హింసకు గురయ్యారు. నేనుకూడా వైసీపీ జెండాను మోశాను. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యలను బెదిరించారు. వైసీపీపై దళితులంతా యుద్ధం చేస్తారు.

లోకేశ్: నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని పోరాడిన దళిత నేతలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. కనీసం నాగమ్మ కుటుంబం దగ్గరకు వెళ్లనీయలేదు. పులివెందులలోనే  అలాంటి పరిస్థితి ఉందంటే ఇక రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. టీడీపీ రాగానే దళితులను ఆదుకుంటాం.

పైడి హర్ష, కావలి:
మా అమ్మను సర్పంచ్ గా నిలబెట్టాను. ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాలేజీలో ఉన్న డ్రైనేజీని మా పొలాల్లోకి వదిలారు. దాని మీద నేను రైతులతో కలిసి ధర్నాలు చేశాం. సర్పంచ్ గా మా అమ్మ నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బెదిరించారు. పెద్దపెద్ద వాళ్లే మానుకున్నారు... నీకేంటి అంత తుత్తర? అని బెదిరించారు. విత్ డ్రా చేసుకోకపోవడంతో నా లారీలు తిరగనివ్వలేదు. వారానికొక స్టేషన్ కు తిప్పారు. వ్యాపారం లేదు...కిస్తీలు కట్టాలి. నా పెద్ద కూతురుకు బంగారు గొలుసు చేయించా... దాన్ని కుదువపెట్టి కిస్తీ కట్టాను. కుటుంబాన్ని పోషించుకోగలుగుతానా అని బాధతో ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్లి సెల్ఫీ తీసి గడ్డిమందు తాగాను. నేను బతకనని డాక్టర్లు చెప్పారు. నాకు రూ.30 లక్షలు వైద్యానికి అయింది..నా బిడ్డలను చంద్రబాబు దత్తత తీసుకుని చదివిస్తున్నారు. చలో కావలికి వస్తుంటే ఎం.ఎస్.రాజును 30 గంటల పాటు అడవుల్లో తిప్పారు. మా అమ్మ, నాన్న ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు. రాజీ చేయకుంటే మరో కేసు పెడతామని హెచ్చరించారు.

లోకేశ్: దళితులపై జరిగే దాడులపై పోరాడుతున్న ఎం.ఎస్.రాజుపై కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేదిస్తోంది. దళితుల తరుఫు మాట్లాడిన వారి గొంతులను నొక్కుతోంది ఈ ప్రభుత్వం. దళితులు కనీసం నామినేషన్ కూడా వేయకూడదంట. గట్టిగా మాట్లాడితే కొట్టి చంపేస్తున్నారు. గొంతు విప్పితే రౌడీషీట్ తెరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఆలోచించాలి. మన గళం విప్పకపోతే ఇంకా చితక్కొట్టి చంపేస్తారు. గళం విప్పి తాడేపల్లి ప్యాలెస్ లో పడుకునే సైకోకు వినిపించేలా నినదించాలి.

ఖండవల్లి లక్ష్మీ, రాజానగరం: రాజానగరంలో బ్లేడ్ బ్యాచ్, డ్రగ్స్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. జక్కంపూడి రాజా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎస్సీలం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మహిళలకు కూడా కుటుంబాలను పోషించుకుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఏదో ఒకటి చేయాలి.

లోకేశ్: మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు, పవనన్న కలిసి మహాశక్తి పథకం ప్రవేశపెట్టారు. 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు చూ.15 వందలు ఇస్తారు. తల్లికి వందనం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తాం. నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు మహాశక్తి కార్యక్రమం ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఆదుకుంటాం.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఈరోజు నడిచిన దూరం 9.6 కి.మీ.*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2,974 కి.మీ.*

*217వరోజు (4-12-2023) యువగళం వివరాలు*

*పిఠాపురం/తుని అసెంబ్లీ నియోజకవర్గాలు*

*ఉదయం*

8.00 – శీలం వారి పాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం.

11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం.

11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

మధ్యాహ్నం

12.05 – జి.ఎం.ఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం.

3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.

*సాయంత్రం*


4.00 – జి.ఎం.ఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.

6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.

6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.

7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.

7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News