Nara Lokesh: లోకేశ్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్న 'కోడి కత్తి' శ్రీను కుటుంబం... చలించిపోయిన లోకేశ్

  • గత ఎన్నికలకు ముందు కోడి కత్తి దాడి ఘటన
  • ఇప్పటికీ జైలులోనే ఉన్న నిందితుడు జనుపల్లి శ్రీను
  • లోకేశ్ పాదయాత్రలో నేడు దళిత గళం కార్యక్రమం
  • టీడీపీ అండగా ఉంటుందని జనుపల్లి శ్రీను కుటుంబ సభ్యులకు లోకేశ్ భరోసా
Janupalli Srinu family members met Lokesh

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన దళిత గళం కార్యక్రమంలో లోకేశ్ ను కోడికత్తి దాడి కేసు నిందితుడు జనుపల్లి శ్రీను కుటుంబం కలిసింది. తమ బిడ్డను జైలు పాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా లోకేశ్ ను కలిసేందుకు ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వచ్చామని జనుపల్లి శ్రీను సోదరుడు వెల్లడించారు. మమ్మల్ని లోకేశ్ అన్న వేదికపైకి పిలిచినందుకు ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. 

ఈ సందర్భంగా మైక్ అందుకున్న లోకేశ్... జనుపల్లి శ్రీను సోదరుడితో ఓ చిన్న ప్రశ్న అడగాలి అని చెప్పారు. మీరు నన్ను కలవడ ఇదే మొదటిసారా, లేక ఇంతకుముందుప్పుడైనా కలిశారా? అని లోకేశ్ ప్రశ్నించారు. అందుకు శ్రీను సోదరుడు, తల్లి, తండ్రి ముక్తకంఠంతో ఇదే మొదటిసారి అని బదులిచ్చారు. 

దీనిపై లోకేశ్ స్పందిస్తూ... కానీ, తామే శ్రీను కోడికత్తి ఇచ్చి దాడి చేయించామని గతంలో తప్పుడు ఆరోపణలు చేశారని, మీరు మమ్మల్ని కలవడమే మొదటిసారి అంటుంటే, ఒక మేం కోడికత్తి ఇచ్చింది ఎక్కడ? అని వ్యాఖ్యానించారు.

"ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా చూశాం, ఎన్నికల ముందు బాబాయ్ గుండెపోటు చూశాం. వాళ్లు దాడి చేసి మాపై నింద మోపారు. ఇవాళ చూడండి... జనుపల్లి శ్రీను కుటుంబాన్ని కూడా ఎలా వేధిస్తున్నారో! శ్రీనుపై కేసు తొలగిపోవడానికి సీఎం తలుచుకుంటే రెండు నిమిషాలు కాదు ఒక్క సెకను చాలు. కానీ అతడ్ని బయటికి రానివ్వరు... కనీసం వాయిదాలకు కూడా వెళ్లరు. దర్యాప్తునకు కూడా సహకరించే పరిస్థితులు లేవు. ఒక దళిత కుర్రాడ్ని కేసులో ఇరికించి లోపలేసి ఐదేళ్లయింది. ఇప్పటికీ బయటికి రాలేదు" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ధైర్యంగా ఉండండమ్మా అంటూ శ్రీను తల్లికి ధైర్యం చెప్పారు. 

కాగా, దళిత గళం కార్యక్రమానికి వేదికపై సమన్వయకర్తగా వ్యవహరించిన మహాసేన రాజేశ్ స్పందించారు. "నేను గత ఎన్నికల సమయంలో మీ ఊరు వచ్చాను. అప్పుడు జనుపల్లి శ్రీను ఎవరి ఫ్లెక్సీలో ఉన్నాడు?" అని శ్రీను సోదరుడ్ని అడిగారు. అందుకు శ్రీను సోదరుడు బదులిస్తూ... జగన్ ఫ్లెక్సీలో శ్రీను ఉన్నాడు అని వెల్లడించాడు. శ్రీను వారం రోజుల కూలికి వెళ్లి రూ.4 వేలతో జగన్ ఫ్లెక్సీ వేయించాడని తెలిపాడు. 

అందుకు మహాసేన రాజేశ్ స్పందిస్తూ... జగన్ వైసీపీలో ఉన్నవారినే టార్గెట్ చేస్తుంటాడని, తాను కూడా వైసీపీ వాడ్నే అయినా 22 రోజుల పాటు కాకినాడ సబ్ జైలులో వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

More Telugu News