KTR: ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్

  • తెలంగాణలో 64 స్థానాలతో కాంగ్రెస్ జయభేరి
  • 39 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైన అధికార బీఆర్ఎస్
  • రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని కేటీఆర్ వెల్లడి 
  • ఎన్నికల ఫలితాల సరళి ఒక వేవ్ లా అనిపించడంలేదని వివరణ 
KTR press meet after election results

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. 

పార్టీ కోసం తమ నేతలు ఎంతో కష్టపడ్డారని, గతం కంటే మంచి మెజారిటీ సాధిస్తామని భావించామని వెల్లడించారు. ఫలితాలు నిరాశకు గురిచేసినా అసంతృప్తి మాత్రం లేదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, మాకు 70 ప్లస్ సీట్లు వస్తాయని మొన్న చెప్పాను కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే తానేమీ బాధపడడంలేదని అన్నారు. 

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఒక వేవ్ లా అనిపించడంలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో, మెదక్ జిల్లాలో ఫలితాలు దాదాపు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని, కరీంనగర్ జిల్లాలో 40:60 నిష్పత్తిలో ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ పరిస్థితి తమకు కూడా అర్థం కాకుండా ఉందని అన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన తర్వాత, మా అభ్యర్థుల అనుభవాలు కూడా తెలుసుకుని ఓటమి కారణాలు ఏవన్నది నిర్ణయిస్తాం అని తెలిపారు. 

"పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో సోదరుడు బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా చేయలేదు. కానీ సుమన్ ఓడిపోయారు. మందమర్రిలో కూడా ఇలాంటి ప్రతికూల ఫలితమే వచ్చింది. 

సింగరేణికి మేం చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నాం, సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్ ఇచ్చాం. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాం. వారసత్వ ఉద్యోగాలు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాం. కానీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన మెజారిటీలు వచ్చాయి. నాకు తెలిసి అంత మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందుకే మా ఓటమికి ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేను కానీ, భిన్నమైన అంశాలు మా ఓటమికి దారి తీసి ఉంటాయని భావిస్తున్నాను" అని వివరించారు. 

గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నానని, ఇకపై సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ వెల్లడించారు. 39 స్థానాల్లో గెలిచేందుకు మా నేతలు ఎంతో శ్రమించారు... వారికి నా అభినందనలు అంటూ  పేర్కొన్నారు.

More Telugu News