Chandrababu: సతీసమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు

  • సింహాచలం క్షేత్రానికి విచ్చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
  • స్వాగతం పలికిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు
  • చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
Chandrababu and Bhuvaneswari visits Simhachalam temple

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు అనారోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. దాంతో ఆయన జైలు నుంచి విడుదలై కంటికి శస్త్రచికిత్స చేయించుకుని కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. 

ఈ లోపు ఆయనకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తొలుత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, ఆ తర్వాత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. 

నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి సింహాచలం క్షేత్రానికి వచ్చారు. ఇక్కడి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అప్పన్న ఆలయంలో చంద్రబాబు దంపతులకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, జిల్లా రెవెన్యూ అధికారులు కూడా చంద్రబాబుకు స్వాగతం పలికారు. 

స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పురోహితులు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించారు. చంద్రబాబు వస్తున్నాడని తెలియడంతో టీడీపీ శ్రేణులు ఆలయం వద్దకు భారీగా తరలి వచ్చాయి.

More Telugu News