Telangana Assembly Election: తొలి ఫలితం చార్మినార్ నుంచే.. పది గంటలకే అర్థంకానున్న సరళి

  • అప్పుడే టీవీలకు అతుక్కుపోతున్న జనం
  • ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ
  • శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ సహా ఆరు నియోజకవర్గాల ఫలితం ఆలస్యం
Telangana Assembly Election Counting Starts From 8am

మరి కొన్ని నిమిషాల్లో బ్యాలెట్ బాక్సులు తెరుచుకోనుండడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు ఇప్పటికే సర్వం సిద్ధం కాగా అందరూ అప్పుడే టీవీలకు అతుక్కుపోతున్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 49 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉన్న చార్మినార్‌ నుంచి తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత భద్రాచలం, అశ్వారావుపేట ఫలితం వెల్లడవుతుంది. ఇక, 10 గంటల కల్లా ఫలితాల సరళి తెలిసిపోతుంది.


శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాల్లో 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ ఫలితాల వెల్లడి ఆలస్యమవుతుంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయగా, ఇక్కడ మాత్రం  28 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అనంతరం అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్‌కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు.

More Telugu News