Alive In Morgue: చచ్చిబతికి.. చచ్చిపోయిన 90 ఏళ్ల వృద్ధురాలు.. విచారణకు ఆదేశించిన బ్రెజిల్ ప్రభుత్వం

90 Year Old Woman Declared Dead At Brazilian Hospital Found Alive In Morgue

  • బ్రెజిల్‌లోని శాన్‌జోస్ నగరంలో ఘటన
  • కాలేయ సమస్యతో తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వృద్ధురాలు
  • చనిపోయిందని నిర్ధారించిన వైద్యులు
  • బ్యాగులో చుట్టి శవాగారానికి తరలింపు
  • కొన్ని గంటల తర్వాత బ్యాగ్ కదులుతుండడంతో చూసిన సిబ్బంది షాక్
  • కళ్లు తెరిచి చూస్తుండడంతో భయంతో కేకలు

ఆ 90 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది ఆమె మృతదేహాన్ని బాడీ బ్యాగ్‌లో కుక్కి శవాగారానికి తరలించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు శవాగార సిబ్బంది ఒకరు బాడీ బ్యాగ్ కదలడాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. భయంగానే అక్కడికెళ్లి బ్యాగ్ తెరచి చూస్తే చనిపోయిందనుకున్న వృద్ధురాలు నవ్వుతూ కనిపించడంతో అతడి పై ప్రాణాలు పైనే పోయాయి. బ్రెజిల్‌లోని శాన్ జోస్ నగరంలో జరిగిందీ ఘటన.

కాలేయ సమస్యతో బాధపడుతూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన 90 ఏళ్ల నోర్మా సిల్వీరా డ సిల్వాను శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించడంతో మృతదేహాన్ని బ్యాగులో చుట్టి శవాగారంలో ఉంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను చూసేందుకు కూడా వైద్యులు అనుమతించలేదు.

దీంతో శనివారం వారు నోర్మాను కడసారి చూసేందుకు ఆసుపత్రికి వచ్చి నేరుగా శవాగారం వద్దకు వెళ్లారు. విషయం అక్కడికి సిబ్బందికి చెప్పారు. ఓ వ్యక్తి ఆమె మృతదేహం ఉన్న బ్యాగ్ వద్దకు వెళ్లగా అప్పటికే అది కదులుతుండడం చూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే జిప్ ఓపెన్ చేసి చూడగా ఆమె కళ్లు తెరిచి తననే చూస్తుండడంతో భయంతో కేకలు వేశాడు. వెంటనే నోర్మా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికీ ఆమె కళ్లు తెరిచి వారిని చూస్తూనే ఉంది.  దీంతో నమ్మకం కలగక శరీరంపై చేయివేస్తే వెచ్చగా ఉంది. ఆ వెంటనే నాడిచూస్తే కొట్టుకుంటూనే ఉంది. 

మరేమాత్రం ఆలస్యం చెయ్యకుండా నోర్మాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కూడా వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం ఉదయం ఆమె నిజంగానే మృతి చెందింది. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నోర్మా బతికి ఉండగానే బ్యాగులో పెట్టడం వల్లే ఊపిరి ఆడక చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నోర్మా చనిపోయినట్టు వైద్యులు రెండోసారి డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News