Rutheraj Gaikwad: విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు అడుగు దూరంలో రుతురాజ్ గైక్వాడ్

Rutheraj Gaikwad is one step away from breaking Virat Kohlis all time record
  • టీ20 ఫార్మాట్‌లో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గెలిచే ఛాన్స్
  • 231 పరుగులతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ
  • ఆస్ట్రేలియాపై చివరి టీ20 మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే గైక్వాడ్ వశం కానున్న రికార్డు
టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వదేశంలో ఆస్ట్రేలియాపై జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన గైక్వాడ్ 50కిపైగా సగటుతో 213 పరుగులు బాదాడు. దీంతో కింగ్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టేందుకు గైక్వాడ్ అడుగు దూరంలో నిలిచాడు. టీ20 ఫార్మాట్‌లో ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో 231 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ రికార్డును గైక్వాడ్ ప్రస్తుత సిరీస్‌లో బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4 మ్యాచ్‌ల్లో 213 పరుగులు చేసిన గైక్వాడ్ ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్‌లో మరో 19 పరుగులు చేస్తే కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అవుతుంది. డిసెంబర్ 3 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ సిరీస్ చివరి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి.

కాగా ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. 2021లో స్వదేశంలో ఇంగ్లండ్‌పై జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఏకంగా 231 పరుగులు బాది ఈ రికార్డును నెలకొల్పాడు. 224 పరుగులతో రెండవ స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 2020లో న్యూజిలాండ్‌పై 5 మ్యాచ్‌ల టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో రాహుల్ ఈ రికార్డు స్థాయి పరుగులు చేశాడు. వీరిద్దరినీ చివరి టీ20 మ్యాచ్‌లో గైక్వాడ్ అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే  3-1 తేడాతో గెలుచుకుంది. బెంగళూరు మ్యాచ్‌లో కూడా విజయాన్ని సాధించి ఆధిక్యాన్ని పెంచుకోవాలని ఊవిళ్లూరుతోంది. ఇక శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Rutheraj Gaikwad
Virat Kohli
Cricket
India vs Australia
Team India

More Telugu News