DK Shivakumar: రిసార్టు రాజకీయాలు ఉండవు.. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయమన్న ఎగ్జిట్ పోల్స్
  • మధ్యప్రదేశ్‌లో హంగ్‌కు ఛాన్స్ అన్న అంచనా
  • రిసార్ట్ రాజకీయాలకు అవకాశం ఉందంటూ కథనాల ప్రచారం
  • ఈ వార్తల్ని కొట్టిపారేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 
  • కాంగ్రెస్ నేతలు విశ్వాసపాత్రులని వ్యాఖ్య  
No Resort Politics No Poaching says Congress DK Shivakumar After Exit Polls

తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా నడుమ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లీడర్లను ఎవరూ కొనుగోలు చేయలేరని, రిసార్టు రాజకీయాలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌‌దే ఘన విజయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చిన విషయం తెలిసిందే. మరోవైపు, మధ్యప్రదేశ్‌లో ఆరు ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాల్లో మూడు.. కాంగ్రెస్‌దే విజయమని పేర్కొన్నాయి. దీంతో, అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది, హంగ్ అసెంబ్లీ, రిసార్టు రాజకీయాలు మొదలవుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కర్ణాటకకు తరలిస్తుందన్న వార్తలు బయలుదేరాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘‘కాంగ్రెస్ నేతలను ఎవరూ కొనుగోలు చేయలేరు. ఈ విషయంలో మా పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి నేతలంతా ఎంతో నమ్మకంగా ఉన్నారు. రిసార్ట్ రాజకీయాలు తప్పవంటున్న వారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఇవన్నీ రూమర్లు మాత్రమే. మా నేతలు పార్టీ పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నారు. వాళ్లకు ఆపరేషన్ లోటస్ గురించి తెలుసు. అది విజయం సాధించదు’’ అని కామెంట్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లీడర్లను సంప్రదించినట్టు తనకు సమాచారం అందిందని డీకే శివకుమార్ తెలిపారు. కానీ అవాంఛనీయమైనదేదీ జరగదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌పై కూడా ఆయన స్పందించారు. ‘‘వ్యక్తిగతంగా నాకు ఎగ్జిట్ పోల్స్‌పై పెద్దగా నమ్మకం లేదు. నేను సర్వే చేయించుకున్నప్పుడు కనీసం లక్ష మందిని శాంపిల్‌గా తీసుకుంటాను. మీడియా వారు మాత్రం ఐదు నుంచి ఆరు వేల మందిని మాత్రమే తీసుకుంటారు. కానీ, తెలంగాణతో పాటూ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా ఉంది. ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఇదే జరగాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు అంచనాలు నిజమవుతాయని భావిస్తున్నా’’ అని డీకే శివకుమార్ పేర్కొన్నారు. 

More Telugu News