Telangana: తెలంగాణలో ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదు: సీఈఓ వికాస్ రాజ్

Telangana Chief Election Commissioner Vikas Raj press meet
  • నిన్న ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
  • సీఈఓ వికాస్ రాజ్ మీడియా సమావేశం
  • రాష్ట్రంలో 70.74 శాతం ఓటింగ్ నమోదైనట్టు వెల్లడి
  • 2018 ఎన్నికల కంటే మూడు శాతం తగ్గినట్టు వివరణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పోలింగ్ పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే... 70.74 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాదులో అత్యల్పంగా 46.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. 

అయితే, గతంలో కంటే ఈసారి పోలింగ్ 3 శాతం తక్కువగా నమోదైందని తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువని వికాస్ రాజ్ వివరించారు. 

ఇక, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని, అందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వికాస్ రాజ్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు. 

ఈసారి ఓట్ ఫ్రమ్ హోమ్ విధానం సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఓటేశారని వెల్లడించారు. సీ విజిల్ యాప్ ద్వారా 10,132 ఫిర్యాదులు వచ్చాయని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
Telangana
Assembly Elections
Polling
Chief Election Commissioner
Vikas Raj
Votes

More Telugu News