Team India: దక్షిణాఫ్రికా టూర్ కు టీమిండియా ఎంపిక... టీ20, వన్డే సిరీస్ లకు రోహిత్, కోహ్లీ దూరం

  • డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన
  • 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న టీమిండియా
  • సాయి సుదర్శన్, రజత్ పాటిదార్ లకు తొలిసారి అవకాశం
  • టీ20 జట్టు సారథిగా సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్
Team India announced for South Africa tour

దక్షిణాఫ్రికా పర్యటనలో పాల్గొనే టీమిండియాను నేడు ఎంపిక చేశారు. డిసెంబరు 10 నుంచి జనవరి 7 వరకు జరిగే ఈ టూర్ లో టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది.

కాగా, ఈ పర్యటనలో టీ20లు, వన్డే సిరీస్ లకు తమకు విశ్రాంతినివ్వాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోరారని, దాంతో వారిద్దరినీ వైట్ బాల్ సిరీస్ లకు ఎంపిక చేయలేదని బీసీసీఐ వెల్లడించింది. అయితే, డిసెంబరు 26 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్ కు వారిద్దరూ జట్టుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. 

ఇక, టీ20ల్లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించిన బోర్డు... వన్డేల్లో జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్ కు అప్పగించింది. ఇంతవరకు అంతర్జాతీయ గడప తొక్కని మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్, తమిళనాడు లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ లకు వన్డే జట్టులో తొలిసారి అవకాశం కల్పించారు. టీ20ల్లో రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. 

ప్రస్తుతం ఆసీస్ తో ఐదు టీ20ల సిరీస్ లో విశేషంగా రాణిస్తున్న యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ముఖేశ్ కుమార్ లను కూడా దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపిక చేశారు. బిష్ణోయ్ కి టీ20 జట్టులో, ముఖేశ్ కుమార్ కు వన్డే జట్టులో స్థానం కల్పించారు.

ముఖ్య విషయం ఏంటంటే... సీనియర్ బ్యాట్స్ మెన్ అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారాలకు మరోసారి సెలెక్టర్లు మొండిచేయి చూపారు. వీరిద్దరూ లేకుండానే టెస్టు జట్టును ప్రకటించారు.


భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, దీపక్ చహర్.

భారత వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చహర్.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ.

More Telugu News