Etela Rajender: బీజేపీకి 30 సీట్ల వరకు వస్తాయి... సంకీర్ణ రాజకీయాల్లో ఏమవుతుందో చూడాలి: ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

  • తమకు 25 నుంచి 30 సీట్లు వస్తాయని.. బీఆర్ఎస్‌తో కలిసేది లేదని స్పష్టీకరణ
  • కేసీఆర్ చెప్పేదొకటి... చేసేది ఒకటి అని ధ్వజం
  • కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని విమర్శలు
Etala rajender interesting comments on bjp seats

తెలంగాణలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు వస్తాయని, సంకీర్ణాల రాజకీయాల్లో ఇక ఏమవుతుందో చూడాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అయితే తాము బీఆర్ఎస్‌తో కలిసేది మాత్రం లేదని తేల్చి చెప్పారు. ఈ రోజు పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో గజ్వేల్ నియోజకవర్గంలో తిరిగితే అర్థమవుతుందన్నారు. కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి అని ధ్వజమెత్తారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు బలమైన నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు ఓటు వేశారని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజానీకం, యువత, మహిళల్లో మార్పు రావాలని, ఆ మార్పు బీజేపీకి రావాలని కోరుకున్నారన్నారు.

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని ఆరోపించారు. అంతిమ నిర్ణేతలు ప్రజలే అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మేధావులు సహకరించారన్నారు. 2021లో... కేసీఆర్ డబ్బు సంచులను, మద్యంను ఎదుర్కొని నిలబడ్డామన్నారు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలతో పాటు అనేకమంది కష్టపడి పని చేశారని ఈటల తెలిపారు. కేసీఆర్ బాధితులు అందరూ తనను ఆదరించారన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. గజ్వేల్ గడ్డపై బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో మెజార్టీ ఎక్కువో.. తక్కువో గెలుస్తున్నానని జోస్యం చెప్పారు.

More Telugu News