Revanth Reddy: డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Congress will form a transparent government sasy TPCC Chief Revanth Reddy
  • ఈ రోజు నుంచి కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకోవచ్చన్న తెలంగాణ కాంగ్రెస్ చీఫ్
  • కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోబోతున్నారని చెప్పిన రేవంత్
  • బీఆర్ఎస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని వ్యాఖ్య
తెలంగాణలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రోజు నుంచి సంబరాలు చేసుకోవచ్చు. అధికారం శాశ్వతమని కేసీఆర్ నమ్మారని, బీఆర్ఎస్ నేతలది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. 

ఎగ్జిట్ పోల్స్ తప్పయితే డిసెంబర్ 3న క్షమాపణ చెప్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలకు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  ప్రజలంటే బీఆర్ఎస్ నేతలకు చిన్నచూపు అని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ మాదిరిగా కాంగ్రెస్ నేతలు నిరంకుశంగా వ్యవహరించబోరని చెప్పారు. ఓడిపోతామని తెలిసినప్పుడు కేసీఆర్ నియోజకవర్గం మారతారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 25కి మించి ఒక్క సీటు కూడా పెరగదని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యలు చూపించే మీడియాకు స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వ పాలనలో విపక్షాలకు విలువ ఉంటుందని హామీ ఇచ్చారు. పారదర్శక ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందన్నారు. 

ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీఆర్ఎస్‌కు అనుకూలంగా రాలేదని రేవంత్ రెడ్డి  అన్నారు. కామారెడ్డిలో ప్రజలు కేసీఆర్‌ను ఓడించబోతున్నారని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని మెచ్చుకున్నారు. శ్రీకాంతాచారి త్యాగానికి ఎన్నికల తేదీకి ఒక సంబంధం ఉందని, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడబోతున్నాయని అన్నారు. ప్రాణ త్యాగం చేయడం ద్వారా శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడని, శ్రీకాంతాచారికి ఘననివాళి అర్పిస్తున్నామని రేవంత్ అన్నారు.

తాము పాలకులుగా ఉండబోమని, సేవకులుగా ఉంటామని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్తారని రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబం ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అన్నారు. అధిష్ఠానం సూచన మేరకు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Election
BRS
KCR

More Telugu News