H1B Visa: హెచ్1బీ వీసాదారులకు ఇది నిజంగా శుభవార్తే!

  • హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ వృత్తి నిపుణులు
  • రెన్యువల్ కోసం స్వదేశానికి రావాల్సిన పరిస్థితి
  • ఇకపై అమెరికాలోనే హెచ్1బీ వీసా రెన్యువల్
  • డిసెంబరు నుంచి పైలట్ ప్రాజెక్టు
US says good news for H1B Visa holders

హెచ్1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ వృత్తి నిపుణులు తమ వీసా గడువు ముగిశాక దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అలా రెన్యువల్ చేసుకోవాలంటే వారు అమెరికా నుంచి స్వదేశానికి రావాల్సిందే. సొంత దేశంలో రెన్యువల్ చేసుకుని మళ్లీ అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి! 

అంతేకాదు, ఈ రెన్యువల్ కు అత్యధికంగా 5 నెలల వరకు సమయం పట్టేది. దాంతో కుటుంబాలను అమెరికాలోనే వదిలేసి రెన్యువల్ కోసం భారత్ వచ్చి నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. హెచ్1బీ వీసాలను అమెరికాలో రెన్యువల్ చేసుకునేందుకు జో బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

డిసెంబరు నుంచి కొన్ని రకాల హెచ్1బీ వీసాల రెన్యువల్ కోసం సొంత దేశాలకు వెళ్లనవసరం లేదని అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ చెబుతోంది. మొదట దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ వెసులుబాటు అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న భారతీయులకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

దీన్ని డొమెస్టిక్ వీసా రెన్యువల్ విధానంగా అమెరికా పేర్కొంటోంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద డిసెంబరులో 20 వేల వీసాలను రెన్యువల్ చేసే అవకాశం ఉందని అమెరికా వీసా సర్వీసుల విభాగం డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ వెల్లడించారు. క్రమంగా రెన్యువల్ చేసే వీసాల సంఖ్యను మరింతగా పెంచుతామని తెలిపారు. 

అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ లో అమెరికాలో పర్యటించిన సమయంలోనే ఈ వీసాల రెన్యువల్ విధానానికి బీజం పడింది. అమెరికా పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ... ఇకపై  భారత వృత్తినిపుణులు వీసా రెన్యువల్ కోసం అమెరికా నుంచి స్వదేశానికి రానవసరంలేదని, ఇక్కడే రెన్యువల్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పుడా ప్రకటన కార్యరూపం దాల్చుతోంది.

More Telugu News