Payyavula Keshav: అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఎన్నికల కమిషనరే నివ్వెరపోయారు: పయ్యావుల కేశవ్

Payyavula Keshav talks to media after meeting with election commissioner
  • ఏపీలో ఓట్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న టీడీపీ నేతలు
  • నేడు ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు
  • చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
ఏపీలో ఓట్ల జాబితాలో తీవ్రస్థాయిలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయంటూ టీడీపీ అగ్రనేతల బృందం ఇవాళ ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేసింది. వైసీపీ కుట్రపూరితంగా, పథకం ప్రకారం తొలగిస్తున్న అర్హుల ఓట్లు, దొంగ ఓట్ల నమోదుపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ని కోరింది. ఎన్నికల కమిషనర్ ని కలిసిన వారిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు, ఇతర ముఖ్య నేతలు వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్ బాబు, గద్దె రామ్మోహన్ రావు, పరుచూరి అశోక్ బాబు, పులివర్తి నాని, సుధారెడ్డి, కోవెలమూడి రవీంద్ర,  రామాంజనేయులు, నసీర్ అహ్మద్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, పిల్లి మాణిక్యరావు తదితరులు ఉన్నారు. 

చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తాం

ఎన్నికల కమిషనర్ ను కలిసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఓట్ల అక్రమాలపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకుంటే, త్వరలో ఏపీకి రానున్న కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదు చేస్తామని వారు స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో ఓట్ల అక్రమాల గురించి విని ఎన్నికల కమిషనరే నివ్వెరపోయారని వెల్లడించారు. 

“అనంతపురం జిల్లా కలెక్టర్ నియోజకవర్గానికో విధంగా నిబంధనలు మారుస్తున్నారు. ఎన్నికల సంఘం పకడ్బందీగా రూపొందించిన విధానాలను కొందరు అధికారులు అధికారపార్టీ నేతలకు అనుకూలంగా మార్చేస్తున్నారు. కొత్తగా ఓటు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునే ఫామ్-6 ను రెండు రకాలుగా ప్రాసెస్ చేయవచ్చు. బీ.ఎల్.వో లకు ఇవ్వడం.. ఆన్ లైన్లో దరఖాస్తు చేయడం. 

కానీ వైసీపీ నేతలు ఉరవకొండ నియోజకవర్గంలో భారీస్థాయిలో ఫామ్-6 దరఖాస్తులు ఆన్ లైన్లో నమోదు చేయించారు. వాటిని పరిశీలించిన ఏ.ఈ.ఆర్.వోలు.. స్థానిక బీ.ఎల్.వోలకు పంపించాలి. అప్పుడు బీ.ఎల్.వోలు ఇంటింటికీ తిరిగి దరఖాస్తుల్లోని నిజానిజాలు పరిశీలించి పూర్తి సమాచారాన్ని తిరిగి ఏ.ఈ.ఆర్.వోలకు పంపిస్తే, వారు వాస్తవాలు తెలుసుకొని ఆ దరఖాస్తుల్ని తిరిగి ఈ.ర్.వోలకు పంపిస్తారు. ఈ.ఆర్.వోలు ఓకే అంటే ఓటర్ లిస్టులో కొత్త ఓటర్ల వివరాలు నమోదు అవుతాయి.  

ఉరవకొండలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. వైసీపీ నేతలు ఆన్ లైన్లో ఫామ్-6 దరఖాస్తులు అప్ లోడ్ చేసి, వాటి వివరాల్ని నేరుగా ఎమ్మార్వోలకు తెలియచేస్తారు. వైసీపీ నేతలు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయగానే... ఎమ్మార్వోలు నేరుగా ఈ.ఆర్.వోకు పంపిస్తున్నారు. దాంతో ఈ.ఆర్.వో నేరుగా ఎమ్మార్వోలు పంపించారు కదా అని ఓటర్ జాబితాలో వివరాలు అప్  లోడ్ చేస్తున్నారు. బీ.ఎల్.వోల వెరిఫికేషన్ లేకుండానే ఇదంతా జరిగిపోతోంది. 

వైసీపీ నేతల ఆదేశాలతో... పగలు పనిచేయని తహసీల్దార్లు దొంగ ఓట్లు నమోదు చేయడానికి మూడురోజులు ఏకబిగిన రాత్రుళ్లు పనిచేశారు. ఇదంతా ఎన్నికల కమిషనర్ కు చెబితే, ఆయన కూడా అవాక్కయ్యారు. ఎమ్మార్వో కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు ఔట్ సోర్సింగ్ సిబ్బంది. వారి ద్వారానే చాలా తతంగం నడుస్తోంది. కానీ దొంగలు దొరక్కుండా తప్పించుకోలేరు. అసలు దరఖాస్తు ఎవరికి ఎన్ని గంటలకు వచ్చింది... ఎవరి నుంచి ఏ సమయానికి ఇతరులకు వెళ్లిందనేది తెలుస్తుంది. డిజిటల్ ఫుట్ ప్రింట్ లో వారు చేసే తప్పులన్నీ కనిపిస్తాయి.

ఇదలా ఉంటే.. మరోపక్క సీక్రెట్ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలపై కూడా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. ఉరవకొండలో మొదటిసారి 6,604 ఓట్లు తొలగించారని తాము చేసిన ఫిర్యాదుపై  ఇద్దరు ఈ.ఆర్.వోలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి 5 నెలలు అవుతున్నా... జిల్లాకలెక్టర్ సదరు అధికారులకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. ఈ విషయంపై కూడా ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశాం. అధికారులపై చర్యలు తీసుకోనివారు కూడా బాధ్యులు అవుతారని ఆయన చెప్పారు. అవసరమైతే తానే స్వయంగా సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మా విజ్ఞప్తులపై గట్టిగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం. ఎన్నికల కమిషనర్ని నేడు మేం ఒకటే అడిగాం. రాజకీయ నేతలమైన మేం ప్రజలపక్షాన పోరాడాలా... లేక ఓటర్ల జాబితా లో జరుగుతున్న అవకతవకలపై పోరాడాలా? అని ప్రశ్నించాం. ఆయన మాకు స్పష్టమైన హామీ ఇచ్చాకే బయటకు వచ్చాం” అని పయ్యావుల కేశవ్ వివరించారు.
Payyavula Keshav
TDP
Election Commissioner
YSRCP
Andhra Pradesh

More Telugu News