Amit Shah: పౌరసత్వ సవరణ చట్టం అమలును ఎవరూ అడ్డుకోలేరు: అమిత్ షా

Amit Shah reiterates no one can stop the implement of CAA

  • 2019లో సీఏఏను తీసుకువచ్చిన కేంద్రం
  • బిల్లుకు పార్లమెంటులో ఆమోదం
  • మైనారిటీల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడంపై దేశవ్యాప్త నిరసనలు
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మమతా సీఏఏను వ్యతిరేకిస్తున్నారన్న అమిత్ షా

భారత్ 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకువచ్చింది. ముస్లిం ప్రాబల్య దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో మత పరమైన హింస, వివక్షకు గురయ్యే మైనారిటీలకు ఆశ్రయం, భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం పరమావధి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లోకి ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులు, బౌద్ధ మతస్తులు, జైనులకు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం అందించే వీలుంటుంది. 

అయితే, ఈ చట్టంలోని మైనారిటీల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడం దేశంలో తీవ్ర నిరసనలకు దారితీసింది. దాంతో సీఏఏ అమలు అప్పట్లో నిలిచిపోయింది. తాజాగా, సీఏఏ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. సీఏఏ... భారత దేశానికి చెందిన చట్టం అని, దీని అమలును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. 

"బెంగాల్ లోకి చొరబాటుదారుల ప్రవేశాన్ని మమతా బెనర్జీ అడ్డుకోలేకపోతున్నారు. బెంగాల్ లో చొరబాటుదారులకు యథేచ్ఛగా ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ మమతా బెనర్జీ మాత్రం మౌనంగా చూస్తున్నారు. దేశంలోకి చొరబాటుదారుల ప్రవేశానికి ఆమె మద్దతు పలుకుతున్నారు కాబట్టే సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. అసోంలో చొరబాట్లను అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వం విజయవంతమైంది. కానీ బెంగాల్ లో చొరబాటుదారులకు ఎలాంటి ఆటంకాలు లేవు. అందుకు కారణం టీఎంసీ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలే" అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News