Nawaz Sharif: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ ఊరట... అవినీతి కేసుల్లో నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు

  • 2018లో రెండు అవినీతి కేసుల్లో నవాజ్ షరీఫ్ కు శిక్ష
  • చికిత్స కోసమంటూ లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయిన షరీఫ్
  • నాలుగేళ్ల అనంతరం పాకిస్థాన్ కు తిరిగి రాక
Islamabad high court acquitted Nawaz Sharif in two corruption cases

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 

2018లో ఈ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొంది. అవెన్ ఫీల్డ్ స్థిరాస్తుల కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, అల్ అజీజియా ఉక్కు పరిశ్రమ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 

అయితే, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలంటూ 2019లో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు. నాలుగేళ్ల పాటు లండన్ లో ప్రవాసం గడిపిన ఆయన స్వయం ప్రకటిత ప్రవాసం నుంచి ఇటీవలే బయటికి వచ్చారు. అక్టోబరులో పాక్ గడ్డపై అడుగుపెట్టారు. 

త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది. షరీఫ్ తిరిగి రావడంతో ఆయన సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్)లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పీఎంఎల్-ఎన్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

More Telugu News