Tunnel: ఉత్తరాఖండ్ లో 17 రోజులుగా టన్నెల్ లోనే... అంతా క్షేమం.. కాసేపట్లో బయటికి రానున్న కార్మికులు

  • చార్ ధామ్ ప్రాజెక్టులో కూలిపోయిన టన్నెల్
  • గత 17 రోజులుగా టన్నెల్ లోనే 41 మంది కార్మికులు
  • పైపు ద్వారా ఆహారం సరఫరా
  • మరో 2 మీటర్లు తవ్వితే కార్మికులు బయటకు!
Workers trapped in tunnel will be out shortly

ఉత్తరాఖండ్ లోని ఓ టన్నెల్ లో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు మరికాసేపట్లో బయటికి రానున్నారు. మరో 2 మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు వెలుపలికి వచ్చేందుకు మార్గం ఏర్పడనుంది. 17 రోజుల పాటు టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల కోసం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 

కాగా, ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ క్షేత్రాలైన బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను కలుపుతూ 4.5 కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీన్ని సిల్క్యారా టన్నెల్ అని పిలుస్తారు. చార్ ధామ్ ప్రాజెక్టులో భాగంగా ఈ డబుల్ లేన్ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. అయితే, నవంబరు 12న సిల్క్యారా ప్రాంతం వైపు టన్నెల్ కూలిపోయింది. 205వ మీటరు నుంచి 260వ మీటరు వరకు టన్నెల్ మూసుకుపోయింది. 

అప్పటికే లోపల కొందరు కార్మికులు పనిచేస్తున్నారు. వారు బయటికి వచ్చే మార్గంలేక అందులోనే చిక్కుకుపోయారు. అప్పటి నుంచి వారికి ఓ పైపు ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నారు. వారు నీరసపడిపోకుండా మంచి పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తూ వచ్చారు. డ్రై ఫ్రూట్స్, మల్టీవిటమిన్ మాత్రలు, డిప్రెషన్ కు లోనవ్వకుండా యాంటీడిప్రసెంట్ ఔషధాలు కూడా పంపించారు. 

కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకువచ్చేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక యంత్రాలను రంగంలోకి దించారు. అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ స్వయంగా రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది శ్రమ ఫలించింది. కార్మికులను క్షేమంగా బయటికి తీసుకువచ్చేందుకు ఇన్నాళ్లకు మార్గం సుగమం అయింది.

More Telugu News