CPI Narayana: చంద్రబాబును కలవాలని కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నం చేశారు: సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందన్న నారాయణ
  • అందుకే చంద్రబాబును కలిసే ప్రయత్నం చేశారని విమర్శ
  • బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ తీరును అందరూ గమనించారని వ్యాఖ్య
KCR and KTR tried to meet Chandrababu says CPI Narayana

ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉండే అవకాశాలు ఉండటంతో ఈ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. తెలంగాణలోని టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబును కలిసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రయత్నించారని.. కానీ, చంద్రబాబు ఒప్పుకోలేదని నారాయణ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందనే విషయం కేసీఆర్ కు అర్థమయిందని... అందుకే బాబును కలిసే ప్రయత్నం చేశారని అన్నారు. చంద్రబాబు మద్దతు కోసం ప్రయత్నించారని చెప్పారు. బాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించిన తీరును అందరూ గమనించారని అన్నారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు ఉండటం వల్లే బీజేపీకి కేసీఆర్ తలొగ్గారని నారాయణ చెప్పారు. అందరికి సన్ స్ట్రోక్ ఉంటుందని... కానీ, కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేస్తోంది.

More Telugu News