Israel: హమాస్ ఉగ్రవాదుల చెరలో జీవితం ఎంత దుర్భరంగా గడిచిందంటే.. విడుదలైన బందీల కథనం

  • ప్లాస్టిక్ కుర్చీలనే మంచాలుగా చేసుకుని నిద్రపోయిన బందీలు
  • ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం
  • రోజులు లెక్కపెట్టుకుంటూ గడిపిన బందీలు
  • బాత్రూముకు వెళ్లాలంటే గంటలకొద్దీ వేచి ఉండాల్సిందే
What was life like in Hamas captivity Freed Israeli hostages share details

అక్కడ ప్లాస్టిక్ కుర్చీలే మంచాలు.. రొట్టెముక్క, కొద్దిగా అన్నమే ఆహారం.. బాత్రూముకు వెళ్లాలంటే గంటలకొద్దీ క్యూ.. హమాస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీల అనుభవాలివి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు నెమరువేసుకున్న చేదు జ్ఞాపకాలివి. గత మూడు రోజుల్లో హమాస్ మొత్తం 58 బందీలను విడిచిపెట్టింది. వీరిలో చాలామంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.

హమాస్ చెర నుంచి బయటకు వచ్చిన వారిలో చాలామంది బందీలుగా తాము ఎదుర్కొన్న అనుభవాలను ప్రపంచం ముందు ఉంచుతున్నారు. శుక్రవారం హమాస్ విడుదల చేసిన బందీల్లో మెరవ్ రవివ్ ముగ్గురు బంధువులు కూడా ఉన్నారు. బందీలుగా ఆమె కజిన్, ఆంటీతోపాటు మరొకరు అనుభవించిన కష్టాలను ఆమె వెల్లడించారు. వారికి వేళాపాళా లేకుండా కాసింత అన్నం, బ్రెడ్ అందించేవారని తెలిపారు. గత 50 రోజుల్లో వారు ఏడు కేజీల బరువు తగ్గారని వివరించారు. రిసెప్షన్ లాంటి ప్రాంతంలో కుర్చీలనే మంచాలుగా చేసుకుని నిద్రపోయేవారని తెలిపారు. బాత్రూములకు వెళ్లేందుకు గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.

బందీలుగా ఉన్న అందరూ బరువు తగ్గారని తెలిపారు. వారి చెరలో క్షణమొక యుగంగా గడిచిందని, రోజులు లెక్కపెట్టుకుని, ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని 85 ఏళ్ల యాఫా అడార్ మనవడు అడ్వా అడార్ తెలిపారు. ఆమె కూడా బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులు చనిపోయారని ఉగ్రవాదులను నమ్మించడం ద్వారా ఆమె బతికి బయటపడ్డగలిగారని అడార్ గుర్తు చేసుకున్నారు. ఆమె విడుదల ఆనందంగా ఉన్నా.. ఉగ్రవాదులు ఆమె ఇంటిని ధ్వంసం చేయడం బాధగా ఉందని చెప్పారు.

More Telugu News