Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం

  • సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు
  • ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్
  • అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి పెట్టిన పార్టీలు
Telangana election campaign is over today

దాదాపు నెల రోజులపాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొన్ని గంటల్లో ముగిసిపోనుంది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండడంతో మంగళవారం సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో  మిగిలిన అతికొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. స్వస్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది. టీవీలు, సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు ఇవ్వకూడదు. అయితే పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలనుకుంటే ఎంసీఎంసీ (మోడల్ కోడ్ మీడియా కమిటీ) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలను మొదలుపెట్టాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే సంసిద్ధమయ్యారు.

More Telugu News