Hardik Pandya: గుజరాత్ టైటాన్స్ ను వీడిపోతుండడం పట్ల హార్దిక్ పాండ్యా స్పందన

  • ఐపీఎల్ లో అతి పెద్ద ఆటగాళ్ల బదిలీ ఒప్పందం
  • హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేసిన ముంబయి ఇండియన్స్
  • గుజరాత్ టైటాన్స్ భారీ మొత్తానికి డీల్
  • టైటాన్స్ యాజమాన్యానికి, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పాండ్యా
Hardik Panda statement after trading to Mumbai Indians from Gujarat Titans

స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో మళ్లీ పాతగూటికి చేరిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబయి ఇండియన్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో, గుజరాత్ టైటాన్స్ ను వీడి వెళ్లిపోతుండడం పట్ల హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. 

"గుజరాత్ టైటాన్స్ యాజమాన్యానికి, జట్టుకు, అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఓ సభ్యుడిగా ఉండడం, జట్టుకు నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. నన్ను, నా కుటుంబాన్ని విశేషంగా ఆదరించారు, అభిమానించారు. ఓ ఆటగాడిగా, ఓ వ్యక్తిగా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. గుజరాత్ టైటాన్స్ తో నా అనుభవాలు, స్మృతులకు నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. చిరస్మరణీయ ప్రస్థానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు" అంటూ హార్దిక్ పాండ్యా వివరించాడు. 

7 సీజన్ల పాటు ముంబయి ఇండియన్స్ కు ఆడిన హార్దిక్ పాండ్యా 2022లో గుజరాత్ టైటాన్స్ కు వెళ్లాడు. పాండ్యా కెప్టెన్సీలో ఆడిన తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. దాంతో హార్దిక్ పాండ్యా పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాతి సీజన్ లోనూ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ గా నిలిచింది. అయితే, గత కొన్ని సీజన్లుగా ఆశించిన మేర రాణించలేకపోతున్న ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్యాపై కన్నేసింది. ఈ క్రమంలోనే గుజరాత్ టైటాన్స్ కు భారీ మొత్తం చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది.

More Telugu News