Kharge: ఎన్నికల ప్రచారంలో ఖర్గే అసహనం.. పార్టీ కార్యకర్తలపై సీరియస్.. వీడియో ఇదిగో!

  • వినాలనుకుంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండన్న కాంగ్రెస్ చీఫ్
  • కల్వకుర్తి ఎన్నికల ప్రచార సభలో ఘటన.. వీడియో వైరల్
  • కాంగ్రెస్ చీఫ్ ను కార్యకర్తలు కూడా గౌరవించట్లేదంటూ బీజేపీ ఎగతాళి
Mallikarjun Kharge Lose His Cool AT Telangana Poll Rally

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహనం కోల్పోయారు. సొంతపార్టీ నేతలపైనే సీరియస్ అయ్యారు. ఓవైపు తాను మాట్లాడుతుంటే పట్టించుకోకుండా తమలో తామే గట్టిగా మాట్లాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం వినాలనుకుంటే ఉండండి, లేదంటే వెళ్లిపోండంటూ ఖర్గే మండిపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేస్తూ.. ఖర్గే పేరుకే పార్టీకి చీఫ్, పార్టీ సామాన్య కార్యకర్త కూడా ఆయనను గౌరవించడంలేదని కామెంట్ చేశారు. పార్టీ అధ్యక్షుడిగా తనకు గుర్తింపు, గౌరవం దక్కకపోవడంతో కలిగిన నిస్సహాయత వల్లే ఖర్గే ఇలా ఒక్కసారిగా బరస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చారు. కల్వకుర్తిలో జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ప్రసంగించారు. ఓవైపు ఆయన మాట్లాడుతున్నా పట్టించుకోకుండా కొంతమంది గట్టిగా వాదులాడుకున్నారు. దీంతో ఖర్గే ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ‘ప్రసంగం వినాలనుకుంటే కూర్చోండి.. లేదంటే వెళ్లిపోండి. అంతేకానీ ఇలా డిస్టర్బ్ చేయొద్దు. గెటవుట్’ అని వ్యాఖ్యానించారు. ఓవైపు మీటింగ్ నడుస్తుంటే మధ్యలో మీ గోలేమిటని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతున్నాడనే కనీస జ్ఞానం లేకుండా మీ ముచ్చట్లేంటని గద్దించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News