KCR: ఉస్మానియా విద్యార్థుల ఆందోళనతో కేసీఆర్ దీక్ష రూటు మార్చారు: సీపీఐ నారాయణ

  • చావు నోట్లో తలపెట్టానని కేసీఆర్ చెప్పడం బూటకమని ఆరోపించిన సీసీఐ నేత
  • తానే ప్రత్యక్ష సాక్షినని, ఉద్యమం నీరుగార్చకూడదనే అప్పట్లో చెప్పలేదన్న నారాయణ
  • కొత్తగూడెంలో సీపీఐ తరపున ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు
KCR Diksha route changed due to concern of Osmania students in movement says CPI Narayana

రాష్ట్ర సాధన ఉద్యమంలో 1200 మంది యువత బలిదానాల కారణంగా మాత్రమే తెలంగాణ ఏర్పాటైందని, కానీ అది తానొక్కడి సాధనే అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ సాధన కోసం చావునోట్లో తలపెట్టానని కేసీఆర్‌ చెప్పడం బూటకమని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ దీక్ష మొదలు పెట్టి విరమించేందుకు ప్రయత్నించాడని, అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన మొదలుపెట్టడంతో కేసీఆర్ అనివార్యంగా రూటుమార్చాడని, దీనికి తానే ప్రత్యక్ష సాక్షినని నారాయణ అన్నారు. 

ఆ నాటి నుంచి కేసీఆర్ ఉస్మానియాకు వెళ్లే ధైర్యం చేయడంలేదని, తెలంగాణ ఉద్యమం నీరుగార్చకూడదనే ఉద్దేశ్యంతోనే అప్పట్లో ఈ విషయాలను బయటకు చెప్పలేదని నారాయణ అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం సీపీఐ, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావుని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని శేషగిరిభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుని గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అస్తమించే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని, జలగం వెంకట్రావుకి ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. నిస్వార్థంగా ప్రజాఉద్యమంలో శ్రమిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్న సాంబశివరావుని గెలిపించాలని అభ్యర్థించారు.

మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. పోలింగ్‌కు ముందు ‘రైతుబంధు’ నిధుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినివ్వడం బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మైత్రిని తెలియజేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఒక బీసీ వ్యక్తిని తొలగించి రాష్ట్రానికి బీసీని సీఎంగా చేస్తామని బీజేపీ చెబుతుండడం హాస్యాస్పదమని నారాయణ అన్నారు. 30 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతుండడం వెనుక బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం దాగి ఉందని ఆరోపించారు.

More Telugu News