Legends League Cricket 2023: క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ను ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు.. గురుత్వాకర్షణ శక్తికే సవాల్.. వీడియో ఇదిగో!

South African cricketers  weird wicket Catch of the century
  • ‘లెజెండ్స్ లీగ్’లో ఘటన
  • సదరన్ సూపర్‌స్టార్ ఆటగాడు మునీవర్ భారీ షాట్
  • డీప్‌లో ఆశ్చర్యకరంగా క్యాచ్ పట్టిన రస్టీ థెరాన్
  • కామెంట్స్‌తో చెలరేగుతున్న క్రికెట్ ఫ్యాన్స్
క్రికెట్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పట్టడం చూసే ఉంటాం. కొన్ని క్యాచ్‌లు ‘ఔరా’ అనిపిస్తాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. అయితే, ఈ సౌతాఫ్రికన్ క్రికెటర్ పట్టిన క్యాచ్ మాత్రం ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’గా మారింది. ఇప్పుడీ క్యాచ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. 

ఇండియన్ కేపిటల్స్ తరపున ఆడుతున్న రస్టీ థెరోన్ డీప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన, అందరూ నోరెళ్లబెట్టే క్యాచ్ అందుకున్నాడు. లెజెండ్స్ లీగ్‌లో భాగంగా డెహ్రాడూన్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిన్న సదరన్ సూపర్‌స్టార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. 

ఉడానా బౌలింగ్‌లో సదరన్ సూపర్‌స్టార్ ఆటగాడు మునావీరా బంతిని బలంగా బాదాడు. అది అమాంతం గాల్లోకి లేచింది. డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న థెరోన్ దానిని అందుకునేందుకు రెడీ అయ్యాడు. పొజిషన్ తీసుకున్నాడు. అయితే, బంతి అతడి చేతుల మధ్యలోంచి జారిపడింది. సరిగ్గా అప్పుడే అనుకోని ట్విస్ట్ జరిగింది.

చేతిలోంచి జారిపడిన బంతి థెరాన్ గజ్జల్లో పడి బౌన్స్ బ్యాక్ అయింది. ఈసారి ఏమాత్రం పొరపాటు చేయని థెరాన్ బంతిని జాగ్రత్తగా ఒడిసిపట్టుకున్నాడు. అది ఎలా జరిగిందో తెలియక ఆటగాళ్లు, స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ చూడొచ్చు. 

దీనిపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. రస్టీ థెరాన్ క్యాచ్ చాలా గొప్పదని, గురుత్వాకర్షణ శక్తి కూడా విశ్రాంతి తీసుకుందని కామెంట్లు చేస్తున్నారు. థెరాన్ ఈ క్యాచ్‌తో భౌతికశాస్త్ర నియమాలను ధిక్కరించాడని మరికొందరు రాసుకొచ్చాడు. ‘క్యాచ్ ఆఫ్ ద సెంచరీ’ అని మరొకరు రాశారు. తానైతే బంతి గ్రౌండ్‌ను తాకిందని భావించానని కామెంటేటర్ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌లో ఇలాంటి క్యాచ్‌ను తానెప్పుడూ చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Legends League Cricket 2023
Rajiv Gandhi International Cricket Stadium
Dehradun
India Capitals
Southern Super Stars
Catch of the century

More Telugu News