Jairam Ramesh: తెలంగాణ ధనిక రాష్ట్రమైతే.. రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య ఎందుకు?: జైరాం రమేశ్

  • కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్న జైరాం రమేశ్
  • తెలంగాణ ఎన్నికల్లో ప్రతిసారీ సెంటిమెంట్ వర్కౌట్ కాదన్న కాంగ్రెస్ నేత
  • ఒవైసీకి ప్రతి దగ్గరా రెండు ముఖాలు ఉంటే.. తెలంగాణలో మూడు ముఖాలని విమర్శ
  • తెలంగాణ అభివృద్ది అంటే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు బాగుపడడం కాదని విమర్శ
  • కర్ణాటకలో విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీలో మార్పు వచ్చిందన్న జైరాం రమేశ్
  • తెలంగాణ ఇవ్వడం వల్ల లాభం ఉండదని తెలిసీ రిస్కు చేశామన్న సీనియర్ నేత
Jai Ram Ramesh On Telangana Special Interview

తెలంగాణను ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దామంటున్న అధికార బీఆర్ఎస్ వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కొట్టిపడేశారు. రాష్ట్రం అంతగొప్పగా ఉంటే రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య ఎందుకని ప్రశ్నించారు. ‘ఏబీపీ దేశం’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై స్పష్టమైన సమాధానాలిచ్చారు. 

తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ గెలుపు తథ్యమని జైరాం రమేశ్ తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీ ‘భారత్ జోడో’ యాత్ర తర్వాత పార్టీలో విశ్వాసం పెరిగిందని, గతంలో పార్టీని వీడిన వారు తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారని తెలిపారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రతిసారీ సెంటిమెంట్ పనిచేస్తుందన్నది భ్రమ మాత్రమేనన్నారు. తెలంగాణలో అభివృద్ధి అంటే తండ్రి, కొడుకు, కూతురు, అల్లుళ్లు బాగుపడడం కాదని విమర్శించారు. తెలంగాణలో దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత ఉందని, రోజుకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 

బ్రాండ్ హైదరాబాద్ కేసీఆర్, కేటీఆర్ సృష్టి ఏమాత్రం కాదని, జలగం వెంగళరావు హయాం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి దీని వెనక ఉందని వివరించారు. తలసరి ఆదాయం పేరుచెప్పి ప్రజలను బీఆర్ఎస్ తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. 2018లో నిరుద్యోగులకు రూ. 3,116 ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, మరి ఈ ఐదేళ్లలో రూపాయి అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని గ్రేడ్-1 రిక్రూట్‌మెంట్లు ఇచ్చారని ప్రశ్నించారు. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్ ఆలోచన, చొరవ, సహకారం లేకుంటే తెలంగాణ ఏర్పాటు జరిగేదే కాదని, రాష్ట్ర ఏర్పాటుకు వారే కారణమని స్పష్టం చేశారు. కేసీఆర్ యూపీఏ ప్రభుత్వంలో భాగమని గుర్తు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత పార్టీలో మార్పు వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. తొలుత బీఆర్ఎస్-బీజేపీ మధ్య పోటీ అన్నారని, గత ఏడెనిమిది నెలల్లో ఏదో మంత్రం వేసినట్టు బీజేపీ మాయం అయిపోయిందని అన్నారు.  బీజేపీ నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతున్నారని, రాజకీయ సెంటిమెంట్ మారుతోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 
 
తెలంగాణ ఏర్పాటు వల్ల తమకు లాభం ఉండదని తెలిసీ రిస్కు చేశామని, దాని ఫలితం అనుభవించామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలన్నీ రాజకీయ నిర్ణయాలు కాదన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అని, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒకే జేబులో ఉన్నాయని అన్నారు. అసదుద్దీన్ ఒవైసీ తన భవిష్యత్తును మాత్రమే చూసుకుంటున్నారని విమర్శించారు. ఆయన భవిష్యత్ కాంగ్రెస్ ఓట్లను చీల్చడమేనని, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీలో ఇది నిరూపణ అయిందని, ఇప్పుడు తెలంగాణలోనూ అదే చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా ఒకే ముఖానికి రెండు ముఖాలు ఉంటాయని, తెలంగాణలో మాత్రం ఎంఐఎంకి మూడు ముఖాలని అభివర్ణించారు.

More Telugu News