GVL Narasimha Rao: తెలంగాణలో ఎవరి ఊహకు అందని ఫలితాలు వస్తాయి: జీవీఎల్ నర్సింహారావు

  • నరేంద్రమోదీ ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని బీసీలకు సూచన
  • బీసీ ముఖ్యమంత్రి నినాదంపై నిశ్శబ్ద విప్లవం మొదలైందని వెల్లడి
  • బీసీలు ఈ అవకాశం వినియోగించుకోకుంటే వందేళ్లయినా మళ్లీ రాదని వ్యాఖ్య
GVL Narasimha Rao comments on BC Chief Minister

బీసీలకు ప్రధాని నరేంద్రమోదీ మంచి అవకాశమిచ్చారని... దీనిని తప్పకుండా వినియోగించుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మోదీ చెప్పిందే చేస్తారనే విషయం అందరికీ తెలుసునని, అందుకే బీసీ ముఖ్యమంత్రి నినాదంపై నిశ్శబ్ద విప్లవం మొదలైందని, ఎవరి ఊహకు అందని ఫలితాలు వస్తాయని జోస్యం చెప్పారు. బీసీలు ఈ అవకాశం వినియోగించుకోకుంటే వందేళ్లయినా మళ్లీ రాదన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దమ్ముంటే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ భూబకాసుర పార్టీ అని విమర్శలు గుప్పించారు. ధరణి పేరుతో దొరికిందల్లా దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిపై పూర్తిస్థాయి శిక్ష పడాలంటే బీజేపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాల హామీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ముస్లింలకు ఐటీ పార్కా... ఇంత దిగజారుడు రాజకీయాలు ఏమిటి? అని ప్రశ్నించారు. ఈ మాట వేరే దేశాలు వింటే నవ్వుతాయన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఇక్కడే బీజం పడిందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారని గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్ట్ చేశారని, కవిత, అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడిన వారు ఎవరూ తప్పించుకోలేరన్నారు. కోడ్ వర్డ్స్‌తో చాటింగ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో తాను అనేక ప్రాంతాల్లో తిరిగానని, అన్నిచోట్ల ఈ విషయం చెబుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళిత బంధు, దళిత సీఎం, కేజీ టు పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు.

More Telugu News