Rahul Gandhi: సోనియాగాంధీ దయవల్లే ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలన చేస్తున్నారు: రాహుల్ గాంధీ

  • సోనియా వల్ల, రాజ్యాంగం, పార్లమెంటరీ సిస్టం వల్ల తెలంగాణ వచ్చిందన్న రాహుల్ గాంధీ
  • అక్రమ సంపాదన అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుంటోందని ఆరోపణ
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ
Rahul Gandhi says kCR is corrupted chief minister

ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని, ఆమె దయవల్ల, రాజ్యాంగం దయవల్ల, పార్లమెంటరీ సిస్టం వల్ల రాష్ట్రం వచ్చిందని గుర్తుంచుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఈ రోజు అక్రమాలు చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల వద్ద కూడా ఈ అక్రమార్జన ఉందన్నారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు.

కుటుంబ పాలన, అవినీతి పాలన వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనిపించడంలేదని ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని, ఆ డబ్బంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికే చేరిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. దొరల పాలనను అంతం చేసి ప్రజాపాలనను తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200కు పెరిగిందని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఆ వర్గానికి ఖర్చు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. పేదల గురించి ఆలోచించేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.

యాభై ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదని కేసీఆర్ చెబుతున్నారని, కానీ ఆయన చదువుకున్న స్కూల్, కాలేజీ అదే పార్టీ కట్టిందని గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ అన్నారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ.3 లక్షల కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. పేదల భూములు లాక్కోవడానికే కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను హామీలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలిచాక 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.

More Telugu News