Big tip: రూ.600 ల శాండ్ విచ్ తిని పొరపాటున 6 లక్షల టిప్.. లబోదిబోమంటున్న అమెరికన్

  • క్రెడిట్ కార్డ్ తో బిల్లు చెల్లిస్తూ ఎమౌంట్ స్థానంలో ఫోన్ నెంబర్ కొట్టిన వైనం
  • కార్డ్ స్టేట్ మెంట్ అందుకున్నాక కానీ విషయం గుర్తించని మహిళ
  • ఆ సొమ్ము తిరిగి తన ఖాతాలో జమ చేయాలంటూ బ్యాంకుతో పోరాటం
US Woman Accidentally Tips Rs 6 lakh At Subway

అమెరికాలోని ఓ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన మహిళ 7 డాలర్ల శాండ్ విచ్ తిని ఏకంగా 7 వేల డాలర్లకు పైగా టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. అంటే.. రూ.632 ల బిల్లుకు దాదాపు రూ.6 లక్షల టిప్ ఇచ్చింది. ఇంత భారీ టిప్ అందడంతో రెస్టారెంట్ సిబ్బంది ఎంతో సంతోషించారు. ఆమె దాతృత్వాన్ని పొగిడారు. అయితే, అదంతా పొరపాటున జరిగిందని తెలిసి ఉసూరుమన్నారు.

ఆ కస్టమర్ పేరు వేరా కార్నర్.. ఇటాలియన్ సబ్ వే లో ఇటీవల ఓ శాండ్ విచ్ తిని బిల్లు చెల్లించే సమయంలో ఏమరపాటుగా వ్యవహరించింది. 7.54 డాలర్లు కొట్టాల్సిన చోట పొరపాటున తన ఫోన్ నెంబర్ కొట్టింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డుతో ఈ ట్రాన్సాక్షన్ పూర్తిచేసింది. ఆ మేరకు బిల్లు అందుకున్నాక కానీ వేరా తన పొరపాటును గుర్తించలేదు. ఆపై బ్యాంకుకు పరుగులు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది.

తన సొమ్మును తిరిగి తన ఖాతాలో జమ చేయాలన్న వేరా కోరికను బ్యాంకు వాళ్లు తొలుత తిరస్కరించారు. దీంతో సబ్ వే మేనేజ్ మెంట్ ను ఆశ్రయించినట్లు వేరా తెలిపారు. అక్కడి మేనేజర్ తనను బ్యాంకును ఆశ్రయించాలని సూచించాడన్నారు. తిరిగి బ్యాంకుకు వెళ్లగా.. విచారణ జరిపించి వేరా సొమ్ము తిరిగిప్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకు వాళ్లు సంప్రదించడంతో సబ్ వే మేనేజ్ మెంట్ కూడా సానుకూలంగా స్పందించింది.. పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. దీంతో వేరా కార్నర్ ఊపిరి పీల్చుకుంది.

More Telugu News