Varla Ramaiah: ‘టార్గెట్ చంద్రబాబు’ అనే లక్ష్యంతో జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు: వర్ల రామయ్య

  • చంద్రబాబును జైల్లో పెట్టడమే జగన్ లక్ష్యమన్న వర్ల రామయ్య
  • సహకరించే అధికారులకు రివార్డులు ఇస్తున్నారని వెల్లడి
  • లేకపోతే బెదిరిస్తున్నారని ఆరోపణ
  • చట్టవ్యతిరేకంగా పనిచేసే అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిక
Varla Ramaiah slams CM Jagan

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 'టార్గెట్ చంద్రబాబు' అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో వర్ల రామయ్య పత్రికా సమావేశం నిర్వహించారు. 

చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలనే టార్గెట్‌తో జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, జగన్ మోహన్ రెడ్డిలా ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో దేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయడం లేదని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు నాయుడిపై జగన్ మోహన్ రెడ్డి పెడుతున్న కేసుల్లో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని వెల్లడించారు. టార్గెట్ చంద్రబాబు అనే నినాదంతో పనిచేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారని ఆరోపించారు. 

"చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు. అలాంటప్పుడు ఆయనను జైల్లో ఎలా పెడతారు? చంద్రబాబు నాయుడు జైల్లో నుంచి బయటకు వస్తే వైసీపీ వారు ఒంటిమీద చలిచీమలు పాకినట్లు ఫీల్ అవుతున్నారు. 

జగన్ మోహన్ రెడ్డికి చెంచాగిరి చేసే అధికారులు ఉండొచ్చు... కానీ, న్యాయస్థానాలను మాత్రం జగన్ రెడ్డి మభ్యపెట్టలేరు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదట మూడు వేల కోట్ల అవినీతి అన్నారు... తర్వాత 3 వందల కోట్లు అన్నారు. చివరికి రూ.27 కోట్లు అని అభాసుపాలయ్యారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టని ఇన్నర్ రింగు రోడ్డు కేసులో అవినీతి అంటూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. 

చంద్రబాబు నాయుడిపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులను అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమర్ధించడం లేదు కాబట్టే ఆయనను పక్కన పెట్టారు. అందుకే అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసులు వాదిస్తున్నారు. పొన్నవోలు న్యాయపరంగా పవిత్రత లేని వ్యక్తి. 'టార్గెట్ చంద్రబాబు' అన్న జగన్ రెడ్డి విధానానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి తాబేదారులా పనిచేస్తున్నాడు. 

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజాయతీపరులైన అధికారులను భయపెడుతూ... తప్పుడు కేసులను సమర్ధిస్తున్న అధికారులకు అవార్డులు, రివార్డులు ఇస్తోంది. సాధారణంగా ఆధారాలు లేకుండా పోలీసులు కేసులు పెట్టరు. జగన్ మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడే అధికారులు, ఆయన ఇస్తున్న తాయిలాలకు ఆశపడే అధికారులు చంద్రబాబు నాయుడిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 

చంద్రబాబునాయుడిపై జగన్ మోహన్ రెడ్డికి ఎందుకంత ద్వేషం? చంద్రబాబునాయుడిపై కక్ష సాధించడం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తూ న్యాయవ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనికి జగన్ మోహన్ రెడ్డి కూడా శిక్షార్హుడే. 

తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి జగన్ మోహన్ రెడ్డి విధానమైన ‘టార్గెట్ చంద్రబాబు’కు వత్తాసు పలకొద్దని అధికారులను హెచ్చరిస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి తాబేదారుల్లా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతీ అధికారి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. జగన్ మోహన్ రెడ్డి మిగిలిన ఈ మూడు నాలుగు నెలలైనా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నా" అని స్పష్టం చేశారు.

More Telugu News