Dhulipala Narendra Kumar: హత్యాయత్నం కేసులో ధూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్ మంజూరు

  • ఇటీవల సంగం డెయిరీ వద్ద ఘర్షణ
  • ఓ వ్యక్తి ఫిర్యాదుతో 15 మందిపై హత్యాయత్నం కేసు నమోదు
  • 14వ నిందితుడిగా ధూళిపాళ్ల నరేంద్ర పేరును చేర్చిన పోలీసులు
  • హైకోర్టును ఆశ్రయించిన ధూళిపాళ్ల తదితరులు
  • ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం
AP High Court granted anticipatory bail for Dhulipalla Narendra

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ నెల 15న గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద ఘర్షణ జరిగింది. పాల బకాయిలు చెల్లించాలని అడిగేందుకు కొందరు పాడి రైతులు డెయిరీ వద్దకు రాగా, అక్కడ ఘర్షణ చోటుచేసుకుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. 

15 మందిపై కేసు నమోదు కాగా, అందులో 14వ నిందితుడిగా టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దాంతో ధూళిపాళ్ల సహా ఈ కేసులో ఉన్నవారు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ధూళిపాళ్లకు, ఇతరులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

అటు, వడ్లమూడిలోని సంగం డెయిరీ వద్ద నేడు హడావుడి నెలకొంది. పోలీసులు సంగం డెయిరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నెల 15న జరిగిన ఘర్షణ కేసులో తాము దర్యాప్తునకు వచ్చామని పోలీసులు చెప్పారు. అనుమతి లేనిదే డెయిరీ లోపలికి ఎవరినీ వెళ్లనివ్వబోమని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు.

More Telugu News