Mohammad Shami: వరల్డ్ కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టడంపై పేసర్ మహ్మద్ షమీ స్పందన

Pacer Mohammad Shami reacts to Mitchell Marsh putting his feet on the World Cup trophy
  • మార్ష్ ప్రవర్తనతో బాధపడ్డానని చెప్పిన షమీ
  • ఆటగాళ్ల తలపైన పెట్టాలనుకుంటున్న ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై మండిపాటు
  • మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలించడంపై నమ్మకం లేదని అభిప్రాయపడ్డ షమీ
వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించాక ఆసీస్ ఆటగాళ్ల సెలబ్రేషన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో వరల్డ్ కప్ ట్రోఫీపై ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టి కనిపించిన ఫొటో చర్చనీయాంశమైంది. మార్ష్‌పై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పలువురు మాజీలు సైతం మార్ష్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. తాజాగా ముగిసిన వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా మార్ష్ తీరుపై విచారం వ్యక్తం చేశాడు. ‘‘ నేను బాధపడ్డాను. ప్రపంచంలోని అన్ని జట్లు పోరాడే ట్రోఫీ. ఆటగాళ్ల తలపైన పెట్టాలనుకుంటున్న ట్రోఫీపై కాళ్లు పెట్టడం నాకు సంతోషాన్ని కలిగించలేదు’’ అని మహ్మద్ మండిపడ్డాడు. ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడాడు.

పిచ్ స్వభావాన్ని పరిశీలించడంపై నమ్మకం లేదు..
క్రికెట్ పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై తనకు అంతగా నమ్మకంలేదని మహ్మద్ షమీ అన్నాడు. బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే పిచ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి తాను ఇష్టపడతానని అన్నాడు. సాధారణంగా బౌలర్లు గ్రౌండ్‌లోకి వచ్చాక పిచ్‌ని పరిశీలిస్తుంటారని, తాను పిచ్ దగ్గరికి వెళ్లబోనని షమీ చెప్పాడు. బౌలింగ్ చేసినప్పుడు మాత్రమే పిచ్ స్వభావం అర్థమవుతుందని, అలాంటప్పుడు ఎందుకు ఒత్తిడి ఎదుర్కోవాలని, ప్రశాంతంగా ఉంటే మెరుగ్గా రాణిస్తారని షమీ అన్నాడు. ఇక ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమవ్వడంపై స్పందిస్తూ.. బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా దృఢంగా ఉండాలని షమీ అన్నాడు. ఆటగాళ్లు కొన్నిసార్లు ఒత్తిడికి లోనవుతుంటారని, కానీ జట్టు చక్కగా ప్రదర్శన చేస్తూ దూసుకుపోతున్నప్పుడు ఆ ఆటగాడికి సంతోషం కలిగిస్తుందని అన్నాడు.

ఇదిలావుంచితే.. ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో పేసర్ మహ్మద్ షమీ అద్భుతంగా రాణించాడు. పాండ్యా చీలమండ గాయంతో వైదొలగడంతో నాలుగు మ్యాచ్‌ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీసి అందరినీ మెప్పించాడు.
Mohammad Shami
Mitchell Marsh
World Cup trophy
Cricket
India vs Australia final

More Telugu News