Team India: థ్రిల్లింగ్ మ్యాచ్ లో టీమిండియాదే విజయం

  • ఆసీస్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా బోణీ
  • 209 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • రాణించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్
  • చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్
Team India beat Asutralia in last ball thriller

ఆస్ట్రేలియాతో విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 2 వికెట్లతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (80), ఇషాన్ కిషన్ (58) రాణించగా, ఆఖర్లో రింకూ సింగ్ (22 నాటౌట్) కీలకపాత్ర పోషించాడు.  

అంతకుముందు, సూర్య కుమార్ యాదవ్ కేవలం 42 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. ధాటిగా ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ 9 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 58 పరుగులు చేశాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (0) రనౌట్ కాగా, మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 21 పరుగులు చేశాడు. 

ఈ పోరు చివరి బంతి వరకు సాగినా... రింకూ సింగ్ పవర్ హిట్టింగ్ తో టీమిండియా గెలుపు తీరాలకు చేరింది. ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సి ఉండగా... టీమిండియా 3 వికెట్లు చేజార్చుకుంది. అక్షర్ పటేల్ బంతిని గాల్లోకి కొట్టి బౌలర్ అబ్బాట్ కే క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాతి బంతికే రవి బిష్ణోయ్ రనౌట్ అయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన స్థితిలో, అర్షదీప్ రనౌట్ కావడంతో, చివరి బంతికి 1 పరుగు కావాల్సి వచ్చింది. 

క్రీజులో ఉన్న రింకూ సింగ్ బలంగా కొట్టిన షాట్ నేరుగా స్టాండ్స్ లో పడింది. కేవలం 1 పరుగు అవసరమైన ఆ దశలో రింకూ సిక్స్ కొట్టినప్పటికీ, అది నోబాల్ కావడంతో ఆ 6 పరుగులు స్కోరుకు జతకలవవు. నోబాల్ కు వచ్చిన ఎక్స్ ట్రాతోనే టీమిండియా విజయం సాధించినట్టయింది. రింకూ 14 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు.

ఆసీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా 2, బెహ్రెండార్ఫ్ 1, మాథ్యూ షార్ట్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 1-0తో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఈ నెల 26న తిరువనంతపురంలో జరగనుంది.

More Telugu News